సెంట్రల్‌ జీఎస్టీ కమిషనర్‌ అరుణ్‌ రిచర్డ్‌ బాధ్యతల స్వీకారం | - | Sakshi
Sakshi News home page

సెంట్రల్‌ జీఎస్టీ కమిషనర్‌ అరుణ్‌ రిచర్డ్‌ బాధ్యతల స్వీకారం

May 20 2026 10:25 AM | Updated on May 20 2026 10:25 AM

సెంట్రల్‌ జీఎస్టీ కమిషనర్‌ అరుణ్‌ రిచర్డ్‌ బాధ్యతల స్వీకారం డాక్టర్‌ వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో అడ్మిషన్లు 100 కిలోల మల్లెలతో శివయ్యకు మహార్చన టెన్త్‌ సప్లిమెంటరీ హాల్‌ టికెట్లు విడుదల అందుబాటులో అవసరమైన మందులు

లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్‌): సెంట్రల్‌ జీఎస్టీ గుంటూరు కమిషనరేట్‌ నూతన కమిషనర్‌గా అరుణ్‌ రిచర్డ్‌ మంగళవారం గుంటూరు కన్నావారితోటలోని ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 2007 సివిల్‌ సర్వీసెస్‌ బ్యాచ్‌కి చెందిన అరుణ్‌ రిచర్డ్‌ విశాఖపట్నం జీఎస్టీ, కస్టమ్స్‌ జోన్‌లోని ఐదు కమిషనరేట్లకు అప్పిలేట్‌ అథారిటిగా, సెంట్రల్‌ ట్యాక్స్‌, కస్టమ్స్‌ అప్పీల్స్‌ కమిషనర్‌గా పనిచేస్తూ గుంటూరు జీఎస్టీకి బదిలీపై వచ్చారు. కమిషనర్‌ మాతృబాష తెలుగు అయినప్పటికీ, తెలుగు రాష్ట్రాలలో పనిచేయడం ఆయనకు ఇదే మొదటిసారి. బాధ్యతలు స్వీకరించిన అరుణ్‌ రిచర్డ్‌ను అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు కలిసి, పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తొలుత కమిషనర్‌కు అడిషనల్‌ కమిషనర్‌ బి.లక్ష్మీనారాయణ, జాయింట్‌ కమిషనర్‌ దేవ్‌కుమార్‌, పీఆర్‌ఓ ఆర్‌.పి.పి కుమార్‌లు ఘనమైన స్వాగతం పలికారు. సిబ్బంది మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించారు.

మొగల్రాజపురం(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌), ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంయుక్తంగా వైఎస్సార్‌ జిల్లా పుట్లంపల్లిలో నిర్వహిస్తున్న డాక్టర్‌ వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని శాప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌.భరణి ఓ ప్రకటనలో తెలిపారు. 4 నుంచి 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ విడుదల చేశామన్నారు. ఆసక్తి ఉన్న వారు జూలై 2వ తేదిలోగా దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు ఏపీస్పోర్ట్స్‌స్కూల్‌.ఏపీ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

నాగాయలంక: స్థానిక శ్రీరామ పాదక్షేత్రం ఘాట్‌లోని శ్రీగంగ పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి మండపంలో మంగళవారం రాత్రి స్వామివారి శివలింగానికి 100 కేజీల మల్లె పువ్వులతో మహార్చన వైభవంగా జరిపారు. పరమేశ్వరుడి జన్మనక్షత్రం ఆర్థ్ర విశిష్టత పురస్కరించుకుని బ్రహశ్రీ అంబా సాయికిరణ్‌ శర్మ నేతృత్వంలో భక్తులు సమర్పించిన మల్లెలతో అర్చన నిర్వహించారు. మల్లె పూలతో స్వామిని వారే స్వయంగా అభిషేకించుకున్నారు. అనంతరం అభిషేక పూజ, అలంకరణను శర్మ శోభాయమానంగా తీర్చిదిద్దారు. అవనిగడ్డకు చెందిన భక్తుడు మండలి వెంకటేశ్వరరావు 70 కేజీల మల్లెలను వితరణ చేశారు. అర్చకుడి మిత్ర బృందం, ఇతర భక్తులు మరో 30 కేజీలు మల్లెలను సమర్పించారు. క్షేత్రం కమిటీ చైర్మన్‌ ఆలూరి శ్రీనివాసరావు, నిర్వహణకర్త తలశిల రఘుశేఖర్‌, ఉప్పల లీలాకృష్ణప్రసాద్‌, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మచిలీపట్నంఅర్బన్‌: టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు– మే 2026కు సంబంధించిన హాల్‌ టికెట్లను విడుదల చేసినట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు మంగళవారం తెలిపారు. సంబంధిత పాఠశాలల లాగిన్‌ల ద్వారా హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. అదేవిధంగా విద్యార్థులు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారిక వెబ్‌సైట్‌ bre.ap.gov.in నుంచి తమ హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునే సౌకర్యం కల్పించామన్నారు. విద్యార్థుల సౌకర్యార్థంమనమిత్ర యాప్‌/సేవ 95523 00009తో కూడా హాల్‌ టికెట్లు పొందవచ్చని చెప్పారు.

కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆలిండియా ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ కెమిస్ట్స్‌ అండ్‌ డ్రగ్గిస్ట్స్‌ (ఏఐఓసీడీ) పిలుపు మేరకు బుధవారం దేశవ్యాప్త బంద్‌ జరగనుందని, ఈ నేపథ్యంలో అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని ఎన్టీఆర్‌ జిల్లా డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పి.శ్రీరామ్‌మూర్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లా కెమిస్ట్స్‌ అండ్‌ డ్రగ్గిస్ట్స్‌ అసోసియేషన్‌, ది కృష్ణా జిల్లా హోల్‌సేల్‌ డ్రగ్‌ ట్రేడ్‌ అసోసియేషన్‌ ఈ ఒక్క రోజు బంద్‌లో పాల్గొంటున్న నేపథ్యంలో ప్రజలకు మందుల సరఫరాలో ఇబ్బంది లేకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. జిల్లాలోని ముఖ్య కేంద్రాల్లోని గుర్తించిన మెడికల్‌ షాపులు, ఆస్పత్రులు, క్లినిక్‌లు, నర్సింగ్‌ హోమ్స్‌లోని మెడికల్‌ షాపులు, ప్రభుత్వాస్పత్రుల ఆవరణలో పనిచేస్తున్న జనరిక్‌ మెడికల్‌ షాపులు, జిల్లాలో పనిచేస్తున్న అన్ని మెడ్‌ప్లస్‌ స్టోర్లు బంద్‌ రోజు కూడా తెరిచి ఉంటాయని, అన్ని రకాల మందుల విక్రయాలు జరుగుతాయని వివరించారు. ప్రజలకు మందుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని జిల్లా పరిధిలోని అన్ని డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్లను ఆదేశించామని తెలిపారు. ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని, అవసరమైన మందులు నిరంతరంగా అందుబాటులో ఉండేలా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. అత్యవసర మందుల అవసరాల కోసం 99512 77333, 99669 67701 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement