దయనీయంగా ధర్మాస్పత్రులు! | - | Sakshi
Sakshi News home page

దయనీయంగా ధర్మాస్పత్రులు!

May 4 2026 10:31 AM | Updated on May 4 2026 10:31 AM

● వేధిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత ● అరకొరగా మందులు సరఫరా ● ప్రసవాలు అంతంత మాత్రమే ● వైద్య సేవలకు సిబ్బంది చేతివాటం జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో దిగజారిన వైద్య సేవలు

నాడు ఖ్యాతి.. నేడు దుర్భర స్థితి..

సాక్షి నెట్‌వర్క్‌: జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు రోజు రోజుకు దిగజారుతున్నాయి. వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తుండగా, కొన్ని ఆస్పత్రుల్లో సేవలన్నీ నర్సింగ్‌ విద్యార్థులే చేయాల్సిన దయనీయ స్థితి నెలకొంది. మరోవైపు మందులు సైతం సక్రమంగా సరఫరా చేయకపోవడంతో రోగులు డబ్బులు చెల్లించి కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. మరోవైపు ప్రసవాలు చేసే సమయంలో సిబ్బంది చేతివాటం చూపుతున్నారు. ధర నిర్ణయించి మరీ వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ‘సాక్షి’ బృందం ఇటీవల జిల్లాలోని పలు ఆస్పత్రులకు విజిట్‌ చేయగా అనేక లోపాలు గుర్తించారు.

పేటలో గర్భిణులకు గడ్డుకాలం..

జగ్గయ్యపేటలో 50 పడకల ఆస్పత్రి ఉంది. నిత్యం 250 మంది వరకూ రోగులు వస్తుంటారు. కానీ ఇక్కడ సిబ్బంది కొరత ఉండటంతో మందులు ఇవ్వడం నుంచి అన్ని సేవలు నర్సింగ్‌ విద్యార్థులే చేస్తున్నారు. ఇక్కడ 12 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, 8 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. అందులో గైనకాలజిస్టు, మత్తు వైద్యుల మధ్య సమన్వయం లేక పోవడంతో ఒకరు ఉంటే, మరొకరు ఉండని పరిస్థితి నెలకొంది. దీంతో సిజేరియన్‌ల కోసం విజయవాడ తరలివెళ్తున్నారు. గైనకాలజిస్టు ఉన్నా ఆల్ట్రాసౌండ్‌ స్కాన్‌ లేక ప్రైవేటుకు వెళ్లాల్సి వస్తోంది. ప్రసవాలు అరకొరగా చేస్తున్నారు. ఇక్కడ బి కాంప్లెక్స్‌, కాల్షియం మందులు కూడా అందుబాటులో లేని దయనీయ స్థితి నెలకొంది. విజయవాడ రిఫర్‌ చేసిన కేసులను తీసుకెళ్లేందుకు ఉన్న అంబులెన్స్‌ మరమ్మతులకు గురికావడంతో ప్రైవేటు అంబులెన్స్‌ల దందా నడుస్తోంది.

మైలవరంలో ప్రసవాల దందా..

మైలవరం ఆస్పత్రిలో ప్రసవాలకు వసూళ్ల దందా నడుస్తోంది. ప్రసవం చేస్తే రూ.1500 చెల్లించుకోవాల్సిందే. ఏ మాత్రం తగ్గినా తీసుకోరు. వారిని వేధిస్తుంటారు. ఇక్కడ 10 మంది వైద్యులు, 15 మంది స్టాఫ్‌ నర్సులు, ఇతర సిబ్బంది ఉన్నారు. ప్రతిరోజూ 300 మంది వరకూ రోగులు వస్తుంటారు. మందులు సైతం అరకొరగా ఉండటంతో, అత్యవసర మందులు బయటే కొనుగోలు చేయాల్సి వస్తోంది. సిజేరియన్‌ల కోసం కొన్ని సార్లు విజయవాడకు పంపుతున్నారు.

నందిగామలో అరకొర మందులు..

నందిగామ ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో మందులు లేవు. వైద్యులు మందులు రాస్తే, వాటిలో సగం బయట కొనుగోలు చేయాల్సి వస్తున్నట్లు రోగులు చెబుతున్నారు. అంతేకాదు అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శనిలా ఈ ఆస్పత్రి పరిస్థితి మారింది. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు వైద్యులు ఉన్నా, ప్రతి కేసును విజయవాడకు తరలించేస్తున్నట్లు రోగులు చెబుతున్నారు. రోగులు తాగేందుకు మంచినీటి సౌకర్యం లేదు. మరుగు దొడ్లు అధ్వానంగా ఉన్నాయి. రోగులు వాటిని వినియోగించలేని దయనీయ స్థితిలో ఉన్నాయి. విజయవాడలోని షేక్‌ రాజా ఆస్పత్రిలో సైతం అరకొర సౌకర్యాలతో కునారిల్లుతోంది. అక్కడ కేవలం గైనకాలజీ సేవలకే పరిమితమవుతున్నారు. ఇతర విభాగాలు కూడా ఏర్పాటు చేయాలంటున్నారు.

గత ప్రభుత్వంలో ప్రసూతి విభాగంలో తిరువూరు కమ్యూనిటీ సెంటర్‌ జాతీయ గుర్తింపు పొందింది. కానీ ఇప్పుడు అక్కడ ప్రసూతి వైద్యులే లేని దయనీయ స్థితి నెలకొంది. ఆపరేషన్‌ థియేటర్లో సైతం సౌకర్యాలు లేక పోవడంతో కు.ని సర్జరీలకు సమీపంలోని పీహెచ్‌సీకి పంపాల్సిన దుస్థితి నెలకొంది. ఇక్కడ ఉన్న పీడియాట్రిక్‌, ఎనస్థీషియన్‌, ఆర్థోపెడిక్‌ సర్జన్‌, జనరల్‌ సర్జన్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంబులెన్స్‌ లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ రిఫర్‌ చేస్తే ప్రైవేటు అంబులెన్స్‌లలో వెళ్లాల్సిందే. మందులు సైతం పూర్తిస్థాయిలో లేక, బయట కొనుగోలు చేయాల్సి వస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement