కృష్ణలంక(విజయవాడతూర్పు): దళితవాడల అభివృద్ధి కోసం, దళితవాడలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించాలంటే దళితులంతా ఐక్యంతో ముందుకు సాగాలని అంబేడ్కర్స్ ఇండియన్ మిషన్(ఏఐఎం) వ్యవస్థాపకుడు, ఐపీఎస్ అధికారి పి.వి.సునీల్‌కుమార్ పేర్కొన్నారు. గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఏఐఎం ఆధ్వర్యంలో ఆదివారం ‘మన వాడ – మన పంచాయతీ – మన పాలన’ అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సునీల్‌కుమార్ మాట్లాడుతూ.. దళితవాడల అభివృద్ధి కోసం పాలకులు కోట్ల రూపాయల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు కేటాయిస్తున్నా వాటి అభివృద్ధి నామమాత్రంగానే ఉందని, ఏటా రూ.10 వేల కోట్లకు పైగా మిగులుతున్నాయని పేర్కొన్నారు. దళితుల అభివృద్ధి కోసం, దళితవాడల అభ్యున్నతి కోసం ఆయా ప్రాంతాలను గ్రామపంచాయతీలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంత వాసులే సర్పంచులుగా విధులు నిర్వర్తించుకొని ఆయా వాడలను అభివృద్ధి చేసుకుంటారని సూచించారు. మాల మాదిగలు అందరూ ఐక్యతతో ముందుకు సాగడానికి కార్యాచరణ రూపొందించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.జె.విద్యాసాగర్ మాట్లాడుతూ దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగానే పరిగణించాలని డిమాండ్ చేశారు. అణగారిన కులాలన్నీ ఒక్కటై ప్రధాన శత్రువును గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య, సీపీఐ నాయకుడు దోనెపూడి శంకర్, ఎంఆర్‌పీఎస్ జాతీయ నాయకుడు మందా వెంకటేశ్వరరావు, ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రమేష్, ఉపాధ్యక్షుడు జె.వెంకటప్పయ్య పాల్గొన్నారు.
ఏఐఎం వ్యవస్థాపకుడు సునీల్‌కుమార్


