లబ్బీపేట(విజయవాడతూర్పు): జబ్బు చేసి వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)కు వచ్చే పేదలకు ఇబ్బందులు తప్పడంలేదు. సీటీ స్కాన్ అవసరమైతే వారి పరిస్థితి వర్ణనాతీతమే. ప్రభుత్వాస్పత్రిలోని రెండు సీటీ స్కాన్ యంత్రాలు ప్రస్తుతం పనిచేయడం లేదు. పదేళ్ల క్రితం పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్ తరచూ మొరాయిస్తోంది. దాని స్థానంలో కొత్త యంత్రం ఏర్పాటు పనులు వారం రోజులుగా జరుగుతున్నాయి. సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లోని మరో సీటీ స్కాన్ యంత్రం కూడా తరచూ మొరాయిస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో ఏదైనా యంత్రం మరమ్మతులకు గురైతే వెంటనే బాగు చేసే వాళ్లు. ప్రస్తుతం మరమ్మతులకు తీవ్ర జాప్యం జరుగుతోంది. ఫలితంగా రోగులకు ఇబ్బందులు తప్పడంలేదు. మంగళవారం ఒక రోగి నడవలేని స్థితిలో ప్రభుత్వాస్పత్రికి రాగా, అతనికి వైద్యులు సీటీ స్కాన్ రాశారు. దీంతో రోగిని అతని బంధువులు మండుటెండలో స్ట్రెచ్చర్‌పై ఉంచి ప్రభుత్వా స్పత్రికి 700 మీటర్ల దూరంలో వైద్య కళాశాల క్రీడా ప్రాంగణంలో ఉన్న అమరావతి సెంట్రల్ ల్యాబ్‌కు నెట్టుకెళ్లి సీటీ స్కాన్ తీయించాల్సి వచ్చింది. వారం రోజులుగా ప్రభుత్వాస్పత్రిలో ఇదే పరిస్థితి కొనసాగుతోందని రోగులు వాపోయారు.


