మచిలీపట్నంఅర్బన్: డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తున్న శాప్ లీగ్స్‌లో భాగంగా జిల్లా స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు ఈ నెల 24వ తేదీ మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార అధికారి కె. ఝాన్సీలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో 35+, 45+ వయో విభాగాల్లో పురుషులు, మహిళలు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు మార్చి 30, 31 తేదీల్లో గుంటూరులోని ఏఎన్‌యూలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం పొందుతారని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో 100, 400, 800, 1500 మీటర్ల పరుగులు, 4 100 రిలే, లాంగ్ జంప్, హై జంప్, షాట్‌పుట్, డిస్కస్, జావెలిన్ త్రో వంటి క్రీడాంశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పాల్గొనదలచిన క్రీడాకారులు శాప్ అధికారిక వెబ్‌సైట్ htt pr://SportS.ap.gov.in/#/home/SaapLeaGue లో నమోదు చేసుకోవాలని సూచించారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రోత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో నాల్గో రోజైన ఆదివారం జగన్మాతకు మందార పుష్పాలు, ఎర్రకలువలు, చామంతులతో అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారి అర్చన నిమిత్తం సేకరించిన పుష్పాలతో ఆలయ ఈవో శీనానాయక్, స్థానాచార్య శివప్రసాద్‌శర్మ, ఆలయ అర్చకులు, సిబ్బంది ప్రధాన ఆలయంలో మూలవిరాట్‌ను దర్శించుకున్నారు. అనంతరం నూతన పూజా మండపంలోని ఉత్సవ మూర్తి వద్ద ఆలయ అర్చకులకు ఆయా పుష్పాలను అందించారు. వేద మంత్రోచ్ఛారణ మధ్య ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పుష్పార్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పంచహారతుల సేవ జరిగింది. పుష్పార్చనలో అమ్మవారికి సమర్పించిన పుష్పాలను అర్చకులు భక్తులకు పంపిణీ చేశారు.


