వీఎంసీ ఇంజినీరింగ్ అధికారులకు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశాలు
పటమట(విజయవాడతూర్పు): పెరుగుతున్న నగర విస్తీర్ణం, జనాభాను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న ఎస్టీపీ సామర్థ్యానికి తోడు నిర్మాణంలో ఉన్న రెండో ఎస్టీపీ పనులను త్వరితగతిన పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ జి. లక్ష్మీశ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం విజయవాడ రామలింగేశ్వర నగర్‌లోని 20 ఎంఎల్‌డీ సామర్థ్యమున్న సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంటు (ఎస్టీపీ)ని సందర్శించారు. మురుగునీటి శుద్ధి ప్రక్రియ, వినియోగంలో ఉన్న సాంకేతిక విధానాలు, నిర్వహణ తీరు వంటి అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్లాంట్ సామర్థ్యానికి అనుగుణంగా శుద్ధి జరుగుతోందా లేదా అన్న దానిపై సమగ్రంగా సమీక్షించారు. అదేవిధంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న మరో 20 ఎంఎల్‌డీ సామర్థ్యమున్న ప్లాంటు పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. రెండో ఎస్టీపీ పనుల పురోగతిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ వేగవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. నగర ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ ఇన్‌చార్జ్ సీఈ పి.సత్యకుమారి, ఇతర అధికారులు ఉన్నారు.


