ఎండోమెంట్ అధికారులతోనే విచారణ కమిటీ వాస్తవాలు వెలుగు చూడటం కష్టమంటున్న భక్తులు సూత్రధారి అయిన ఈవో భవాని ఎక్కడున్నారు? నేటి నుంచి విచారణ
భక్తులకు సమాచారం ఏది?
స్వామి సొమ్ము స్వాహా ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్యం
పెనమలూరు: పవిత్ర పుణ్య క్షేత్రం యనమలకుదురు రామలింగేశ్వరుని ఆలయంలో స్వామివారి ఆభరణాలు, సొమ్ము స్వాహా వ్యవహారంలో ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో జరిగిన ఘటనలపై ప్రభుత్వ స్పందన సక్రమంగా లేదని భక్తులు విమర్శిస్తున్నారు. అదే శాఖకు చెందిన అధికారులతో విచారణ చేయిస్తే అసలు వాస్తవాలు వెలుగు చూస్తాయా అని ప్రశ్నిస్తున్నారు. అసలు సూత్రధారి ఆలయ ఈవో ఎన్.భవానీని పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేయకపోవటంతో శివుడికి న్యాయం ఎలా జరుగుతుందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
యనమలకుదురు శ్రీపార్వతీ సమేత శ్రీరామలింగేశ్వరస్వామివారి దేవస్థానంలో గత కొద్దికాలంగా స్వామివారి ఆభరణాలు, హుండీలో సొమ్ము ఈవో భవానీ నాయకత్వంలో స్వాహా చేశారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమెదు చేశారు. ఆలయ అభివృద్ధికి దాత సంగా నరసింహారావు తన ఆస్తినంతా స్వామివారి ఆలయ అభివృద్ధికి ఖర్చు చేసి శ్రమించారు. భక్తులు కూడా స్వామివారికి తమ వంతు సాయం అందించారు. ఆలయం దినదినాభివృద్ధి చెందటంతో రాష్ట్రంలోనే శ్రీరామలింగేశ్వరస్వామివారికి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు లభించింది. దీంతో భక్తుల సంఖ్య పెరగటంతో స్వామివారికి హుండీ ఆదాయం పెరిగింది. దీంతో స్వామివారి ఆదాయంపై స్వార్థ పరుల కన్ను పడింది.
సూత్రధారి ఎక్కడ?
ఆలయంలో స్వామివారి సంపదపై కన్నేసిన అసలు సూత్రధారి ఈవో ఎన్.భవాని ఎక్కడన్న ప్రశ్నకు సమాధానం దొరకటం లేదు. పోలీసులు ఆలయంలో నిధుల స్వాహాపై కేసు నమోదు చేసి ఇద్దరు అర్చకులు సాగర్, పూర్ణ, ఉద్యోగి రోశయ్యలను అరెస్టు చేసినా నేటికి ఈవో ఎన్.భవానీని అరెస్టు చేయలేక పోయారు. ఈవోను అరెస్టు చేయక పోవటంతో వెనుక పెద్దల పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మీడియాలో కథనాలు రావటంతో ఇక తప్పక భవానీని సస్పెన్షన్ చేశారని చెబుతున్నారు. భవానీని అరెస్టు చేయటంతో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని భక్తులు మండి పడుతున్నారు. ఆమె చిక్కితేనే స్వాహా చేసిన స్వామివారి కానుకల వ్యవహారం బహిర్గతం అవుతుందని భక్తులు అంటున్నారు. పైగా ఆమె వెనుక ఉన్న పెద్దల వ్యవహారం కూడా వెలుగు చూస్తుందని భక్తులు చెబుతున్నారు. అలాగే జైలుకు వెళ్లిన నిందితులను కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారణ చేయలేదు.
ఇదేం కమిటీ?
ఆలయంలో స్వామివారి కానుకలు స్వాహా చేసిన ఘటనపై రీజనల్ జాయింట్ కమిషనర్ విచారణకు ఎండోమెంట్ శాఖలో ఐదుగురు అధికారులను నియ మించారు. ఈ కమిటీ ఈ నెల 15వ తేదీన వేసినట్లు ఉత్తర్వుల్లో ఉంది. అయితే కమిటీ చాలా ఆలస్యంగా ఆలయానికి సోమవారం విచారణకు వస్తోంది. కమిటీ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని భక్తులు అభ్యంతరం తెలుపుతున్నారు. ఇంటి దొంగలను కమిటీ ఏమి చేయగలదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ‘సిట్’ వేసి వివిధ శాఖల అధికారులతో విచారణ చేయిస్తే అసలు గుట్టురట్టవుతుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. కమిటీ వ్యవహారం పరిశీలిస్తే తూతూ మంత్రంగా విచారణ చేసి కథ కంచికి పంపే అవకాశం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయం ప్రక్షాళన జరిగితేనే వాస్తవాలు వెలుగు చూస్తాయని భక్తులు తెలుపుతున్నారు.
ఆలయంలో స్వామివారికి, అమ్మవారికి భక్తులు సమర్పించిన ఆభరణాలు మాయం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. అసలు భక్తులు స్వామివారికి ఏమి కానుకలు ఇచ్చింది నిగ్గు తేలాలంటే భక్తులు సైతం విచారణ కమిటీ ముందుకు రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు చేపట్టిన విచారణ భక్తులకు కాని, గ్రామస్తులకు కాని సమాచారం లేదు. వాస్తవాలు వెలుగు చూడాలంటే నాలుగు గోడల మధ్యకాకుండా ఉన్నతాధికారులు సమక్షంలో బహిరంగ విచారణ చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఎండోమెంట్ అధికారులతో కాకుండా సిట్ వేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.


