భవానీపురం(విజయవాడపశ్చిమ): రిటైర్‌మెంట్ బెనిఫిట్లతోపాటు పెన్షనర్లకు రావల్సిన రూ.26 వేల కోట్లను తక్షణమే విడుదల చేసి వారిని ఆదుకోవా లని ఎన్టీఆర్ జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.దాలినాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భవానీపురం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఆల్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ అసోసియేషన్ హాల్‌లో గురువారం నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పెన్షర్లకు గతంలో ఇచ్చిన విధంగానే అడిషనల్ క్వాంటమ్ చెల్లించాలన్నారు. పెన్షనర్ల ఆర్థికపరమైన సమస్యల పరిష్కారంపై సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. తొలుత విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు ఆవంచ వేణుగోపాల రాధాకృష్ణమూర్తి పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఆల్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యేమినేని వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా విశిష్ట అతిథులుగా అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ కె.వీరబాబు, జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బొమ్మదేవర విష్ణువర్ధన్, ఏపీ స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జి.నారాయణరావు పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా సూరిశెట్టి రామయ్య, వరలక్ష్మి మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యారమ్స్, చెస్ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. క్యారమ్స, చెస్ పోటీల్లో మూడేళ్లపాటు వరుసగా ప్రథమ స్థానంలో నిలిచిన ప్రతాప శ్రీనివాసరావుకు రోలింగ్ షీల్డ్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు యేమినేని వెంకటేశ్వర్లు, యెనిగళ్ల సుబ్బారావు, ఉపాధ్యక్షుడు పమిడిపాటి పట్టాభి రామారావు, గౌరవ సలహాదారు సాలి ఆంజనేయరావు, కొత్తపల్లి సంజీవరెడ్డి, సంయుక్త కార్యదర్శి బర్రె శశాంక బాబు, సహాయ కార్యదర్శి పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దాలినాయుడు


