ప్రక్షాళన కథ.. అంతులేని వ్యథ! | - | Sakshi
Sakshi News home page

ప్రక్షాళన కథ.. అంతులేని వ్యథ!

Mar 21 2026 5:28 AM | Updated on Mar 21 2026 5:28 AM

ప్రక్షాళన కథ.. అంతులేని వ్యథ! సగం సగం పనులతో ఆపరేషన్‌ బుడమేరు మమ!

హెడ్‌ రెగ్యులేటర్‌కు ఎగువన బుడమేరులో భారీ మట్టి దిబ్బలు చినుకు పడితే ముంపు భయంతో వణికిపోతున్న విజయవాడ ప్రజలు ప్రభుత్వ నిర్లక్ష్యంతో రియల్‌ ఎస్టేట్‌ రంగంపై తీవ్ర ప్రభావం

ప్రవాహానికి అడ్డుగా భారీ మట్టి దిబ్బలు

డైవర్షన్‌ కెనాల్‌ గండ్ల వద్ద రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేసిన వైనం

సగం సగం పనులతో ఆపరేషన్‌ బుడమేరు మమ!

జి.కొండూరు: బుడమేరు తన ఉగ్ర రూప ప్రదర్శనతో జనజీవనాన్ని అతలాకుతలం చేసి ఏడాదిన్నర కావస్తున్నా ప్రక్షాళనపై రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అంతులేని నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లి రాష్ట్ర ప్రభుత్వం తన మానస పుత్రికగా చెప్పుకునే అమరావతి ప్రతిష్టకు భంగం వాటిల్లినా మొద్దు నిద్ర వీడడం లేదు. వరదలొచ్చి పోయిన నాటి నుంచి బుడమేరు పరీవాహక ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ రంగంపై తీవ్ర ప్రభావం పడినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. చినుకుపడితే కంటి మీద కునుకులేక విజయవాడ నగర ప్రజలు అల్లాడుతుంటే ప్రక్షాళన చేస్తామంటూ, సమాంతరంగా మరో కాల్వ తవ్వుతామంటూ ఉత్తర ప్రగల్భాలు పలకడం తప్ప క్షేత్రస్థాయిలో ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరలా వానా కాలం వచ్చేలోపు అయినా ప్రభుత్వం ప్రక్షాళనపై దృష్టి సారిస్తే బుడమేరు మరోసారి జల ప్రళయాన్ని సృష్టించకుండా అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.

అసంపూర్తిగా రిటైనింగ్‌ వాల్‌

బుడమేరుకు 2024, ఆగస్టు 31వ తేదీన వచ్చిన వరదలకు వెలగలేరు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి కృష్ణానది వరకు ఉన్న బుడమేరు డైవర్షన్‌ కెనాల్‌కు ఎడమ వైపున మూడు చోట్ల, కుడి వైపున ఏడు చోట్ల గండ్లు పడ్డాయి. అయితే ఎడమ వైపున శాంతినగర్‌ వద్ద పడిన మూడు గండ్ల నుంచి వరద ప్రవాహం విజయవాడ వైపు మళ్లీ విజయవాడ ప్రజలు రోజుల తరబడి నీటి ముంపులో గడపాల్సి వచ్చింది. దీని వల్ల భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే ఆ వెంటనే బుడమేరు ప్రక్షాళన చేస్తా మంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు మంత్రులు ఊదరగొట్టారు. ఆ తర్వాత డైవర్షన్‌ కెనాల్‌కు ఎడమ వైపున పడిన గండ్ల వద్ద రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులు, వెలగలేరు హెడ్‌ రెగ్యులేటర్‌ మరమ్మతుల కోసం అంటూ వరద లొచ్చిపోయిన ఏడు నెలల తర్వాత 2025, మార్చి 21వ తేదీన రూ.39.77కోట్లు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీఓని విడుదల చేసింది. ఈ పనులకు జీఓ ఇచ్చిన యాభై రోజుల తర్వాత మే 15వ తేదీన శంకుస్థాపన చేసి రూ.28కోట్లతో రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం, రూ.1.80కోట్లతో రెగ్యులేటర్‌ మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ పనులలో భాగంగా శాంతినగర్‌ వద్ద డైవర్షన్‌ కెనాల్‌ గండ్లు పడిన ప్రదేశంలో ఎడమవైపు నిర్మించే రిటైనింగ్‌ వాల్‌ 8.65మీటర్ల ఎత్తు, 1.4మీటర్ల వెడల్పు 500మీటర్ల పొడవునా, అదేవిధంగా కుడి వైపు అంటే శాంతినగర్‌ వైపున ఇదే కొలతలతో యాభై మీటర్ల పొడవునా రిటైనింగ్‌ వాల్‌ను నిర్మించాల్సి ఉండగా పనులు జరుగుతున్న సమయంలో పట్టిసీమ నీటిని విడుదల చేయడంతో ఎడమవైపు 360మీటర్లు పొడవున మాత్రమే రిటైనింగ్‌ వాల్‌ని నిర్మించి జూన్‌ 9వ తేదీతో పనులను ఆపేశారు. రెగ్యులేటర్‌ గేట్లకు సైతం హడావుడిగా మరమ్మతులు చేసి, రంగులు వేసి వదిలేశారు. ఇంకా ఎడమ వైపున 140మీటర్లు పొడవు, కుడి వైపున యాభై మీటర్ల పొడవునా రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం చేయాల్సి ఉంది. అయినప్పటికీ వాల్‌ నిర్మాణం పూర్తయ్యిందంటూ, ఇక గండ్లు గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదంటూ సాక్షాత్తూ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు కూటమి ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. ఈ బ్యాలెన్స్‌ పనులు మరలా తిరిగి ప్రారంభించకపోవడంతో గోడ నిర్మాణాన్ని ఆపేసినట్లేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బుడమేరు ప్రక్షాళనకు రూ.500కోట్ల ఖర్చవుతుందని అంచనాలు వేసి ఒక్కరూపాయి కూడా విడుదల చేయకుండా వదిలేయడంతో బుడమేరు హెడ్‌ రెగ్యులేటర్‌కి దిగువన విజయవాడ నగరంలో ఆక్రమణలను తొలగించలేదు. కాల్వ సామర్థ్యం పెంచలేదు. వెలగలేరు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి కృష్ణా నది వరకు 11.90కిలోమీటర్లు మేర ఉన్న డైవర్షన్‌ కెనాల్‌కు కాంక్రీటు లైనింగ్‌ వేయలేదు. అంతే కాకుండా బుడమేరు హెడ్‌రెగ్యులేటర్‌కు ఎగువన ఏ.కొండూరు వరకు ఉన్న 42కిలోమీటర్ల బుడమేరు కాల్వలో ఉన్న కంప చెట్లు, మట్టి దిబ్బలను తొలగించలేదు. హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి ఎగువన బుడమేరులో పోలవరం కుడి కాల్వ కలిసే ప్రదేశం వరకు వరద ప్రవాహానికి భారీగా మట్టి దిబ్బలు పేరుకపోవడం, వాటిని తొలగించకపోవడంతో మరింత ప్రమాదకరంగా మారింది. వానా కాలంలో భారీగా వరదొస్తే ఈ మట్టిదిబ్బల పోటు వల్ల బుడమేరు కట్టకు ఇరువైపులా గండ్లు పడి వెలగలేరు, హెచ్‌.ముత్యాలంపాడు, కవులూరు గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో పాటు విజయవాడ నగర ప్రజలకు మరో వరద ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement