రెండో రోజు కొనసాగిన వసంత నవరాత్రోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): జగన్మాత దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న వసంత నవరాత్రోత్సవాలలో భాగంగా శుక్రవారం అమ్మవారికి గులాబీలు, కనకాంబరాలతో అర్చన జరిగింది. తొలుత ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, దుర్గగుడి ఈవో శీనానాయక్, అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది అమ్మవారి పూజ కోసం సేకరించిన పుష్పాలతో ప్రధాన ఆలయంలోని మూలవిరాట్‌ను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పూజా మండపానికి చేరుకుని పూలగంపలను అర్చకులకు అందజేశారు. రెండో రోజు పుష్పార్చనలో 10 మంది ఉభయదాతలు పూజలో పాల్గొన్నారు. వారికి ప్రత్యేక క్యూలైన్ మార్గంలో ఉభయదాతలకు అమ్మవారి దర్శనం కల్పించారు. పుష్పార్చన అనంతరం భక్తులకు ఆ పుష్పాలను పంపిణీ చేశారు.
దుర్గమ్మకు కలెక్టర్ ప్రత్యేక పూజలు..
విజయవాడ నగర పాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరణకు ముందు కలెక్టర్ లక్ష్మీశ కుటుంబ సమేతంగా దుర్గమ్మకు ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో అమ్మవారి ప్రసాదాలను అందించారు.


