కన్నీటి సుడులు | - | Sakshi
Sakshi News home page

కన్నీటి సుడులు

Mar 21 2026 5:28 AM | Updated on Mar 21 2026 5:28 AM

గోదారమ్మ ఒడిలో.. కన్నీటి సుడులు విషాదం మిగిల్చిన ఇంజినీరింగ్‌ విద్యార్థుల విహారయాత్ర ఆశలన్నీ ఆవిరి..

భద్రాచలం సమీపాన గోదావరిలో గల్లంతయిన ఐదుగురు దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ఘటన వారిలో ఇద్దరు ఉయ్యూరు విద్యార్థులు ఒకరి మృతదేహం లభ్యం, మరొకరి కోసం కొనసాగుతున్న గాలింపు

గోదారమ్మ ఒడిలో..
విషాదం మిగిల్చిన ఇంజినీరింగ్‌ విద్యార్థుల విహారయాత్ర

ఉయ్యూరు: సరదా.. సంతోషాలు.. ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. తమ బిడ్డలు భద్రాది రామయ్య దర్శనానికి వెళ్లి సంతోషంగా గడిపి ఇంటికి వస్తున్నారనుకున్న తరుణంలో గోదారమ్మ తనలో కలిపేసుకుందన్న హృదయ విదారక ఘటన ఆ కుటుంబాల్లో శోకాన్ని నింపింది. ఉన్నత విద్య పూర్తయితే తమకు చేదోడుగా ఉంటారని ఆశిస్తే విధి వక్రించి తమ బిడ్డలను అనంతలోకాలకు తీసుకెళ్లిపోవటంతో ఆ కుటుంబాల రోదన ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. తెలంగాణ సరిహద్దు ప్రాంతం, భద్రాచలం సమీపంలోని ఏటిపాక మండలం పురుషోత్తమపట్నం పక్కన కొల్లిగూడెం వద్ద గోదావరి పాయలో స్నానానికి వెళ్లిన ఏడుగురు విద్యార్థుల్లో ఐదుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఉయ్యూరుకు చెందిన ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యంకాగా, మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది.

ఒక్కగానొక్కడూ..

పామర్రు మండలం కనుమూరుకు చెందిన దగ్గుబాటి ఫణీంద్రనాథ్‌, ఉష దంపతులు ఉయ్యూరు పట్టణంలోని శ్రీనివాసా కాలేజ్‌ రోడ్డులో అవంతి అపార్టుమెంట్స్‌లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. నెలల వయస్సులోనే ఒకబిడ్డను కోల్పోయారు. ఉన్న ఒక్కగానొక్క బిడ్డ దగ్గుబాటి నవదీప్‌ (19)ను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ప్రస్తుతం నవదీప్‌ కేఎల్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సెలవులు రావటంతో తమ స్నేహితులతో చదువుతున్న విద్యార్థి భద్రాచలంలో ఉండటంతో స్నేహితులు అంతా కలిసి భద్రాచలం వెళ్లారు. విషయం తెలుసుకున్న నవదీప్‌ ఈనెల 19న భద్రాచలం వెళ్లాడు. శుక్రవారం స్వామి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో కొల్లిగూడెంలో గోదావరి పాయలో స్నానాలకు దిగారు. స్నానం చేసే సమయంలో గల్లంతవ్వటంతో గజ ఈతగాళ్లు ఏటిపాయలో వెతగ్గా నవదీప్‌ మృతదేహం లభ్యమైంది.

వద్దని వారించినా..

విషయం తెలుసుకున్న ఫణీంద్రనాథ్‌ కుటుంబం తల్లడిల్లింది. భద్రాచలం వెళ్లొద్దని తండ్రి వారించినా తల్లిదండ్రులను ఒప్పించి స్నేహితులతో సరదగా గడిపి వస్తానని చెప్పి వెళ్లి విగత జీవుడ య్యా డు. ఉన్న ఒక్కబిడ్డను పై చదువులకు ఇతర దేశాలకు పంపకుండా కళ్లముందే చదివించుకుంటుంటే బిడ్డను దూరం చేసి విధి తమను దిక్కులేని వాళ్లను చేసిందంటూ బాధిత కుటుంబం రోధించింది. తల్లి ఉష సొమ్మసిల్లిపడిపోయింది.

యుద్ధ భయం.. మరో వైపు పుత్రశోకం

తేజజ్ఞసాయి తండ్రి శ్రీనివాస్‌ సౌతాఫ్రికాలో ఉంటున్నాడు. పుత్రుడి విషయం తెలిసి విమానటికెట్లు బుక్‌ చేసుకున్నారు. హుటాహుటిన బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. యుద్ధ వాతావరణ నేపథ్యంలో విమానం బయలుదేరు వరకూ ఏం జరుగుతుందో చెప్పలేమని అధికారులు చెబుతుండటంతో ఆ తండ్రి వేదన వర్ణనాతీతంగా ఉంది.

మరో ఏడాదిలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసుకుని ఇతర దేశాల్లో ఉద్యోగం చేస్తాడనుకున్న కొడుకు గోదావరి స్నానానికి వెళ్లి గల్లంతవ్వటంతో ఆ కుటుంబం తల్లడిల్లింది. అదే అవంతి అపార్టుమెంటులో నివాసం ఉంటున్న గోక శ్రీనివాస్‌, అరుణ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్నకొడుకు ఇంటర్‌ పరీక్షలు రాశాడు. పెద్ద కొడుకు తేజజ్ఞసాయి (20) ఎస్‌ఎఆర్‌ఎంలో ఇంజినీరింగ్‌ తృతీయ సంవత్సరం హాస్టల్‌లో ఉంటూ చదువుతున్నాడు. తేజజ్ఞసాయి తండ్రి శ్రీనివాస్‌ సౌతాఫ్రికాలోని మడ్‌గాస్కర్‌లో ఉద్యోగం చేస్తున్నారు. శ్రీనివాస్‌ సతీమణి అరుణ ఉయ్యూరులో పిల్లలతో ఉంటోంది. తేజజ్ఞ స్నేహితులతో కలిసి ఈ నెల 18న భద్రాచలం వెళ్లాడు. ఈ క్రమంలోనే తన అపార్టుమెంటులో ఉంటున్న నవదీప్‌ను కూడా రమ్మని పిలవటంతో అతను కూడా వెళ్లా డు. కొల్లిగూడెం చేరుకున్న స్నేహితులు ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండగా ఏటిపాయలో స్నానానికి దిగారు. అయితే తేజజ్ఞసాయి, నవదీప్‌లకు ఈత రాకున్నా, స్నేహితులతో కలిసి స్నానానికి దిగారు. ఇంతలో ఊబిలో చిక్కుకుని గల్లంతయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement