ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు కర్నూలు జిల్లా మునగాలపాడుకు చెందిన బోయే వెంకటేష్ కుటుంబం రూ.4లక్షల విలువైన 30 గ్రాముల బంగారంతో చేసిన మంగళ సూత్రాలను శుక్రవారం కానుకగా సమర్పించారు. అనంతరం దాతలకు అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.
మచిలీపట్నంఅర్బన్: రంజాన్ సందర్భంగా మార్చి 21న ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఇంటర్మీడియెట్ విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వ్యాల్యుయేషన్) మార్చి 22 ఆదివారం నుంచి ప్రారంభమవుతుందని ఇంటర్మీడియెట్ పరీక్షల అధికారి ఎస్. సరళ కుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలోని నోబుల్ కళాశాలలో ఫస్ట్ స్పెల్ వ్యాల్యుయేషన్ నిర్వహణకు 10 మంది అసిస్టెంట్ క్యాంప్ అధికారులు, 40 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 225 మంది ఎగ్జామినర్లు పాల్గొననున్నట్లు తెలిపారు. మిగతా స్పాట్ వ్యాల్యుయేషన్ షెడ్యూల్‌లో ఎటువంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. ఏప్రిల్ మొదటి వారాంతంలో మూల్యాంకనం పూర్తి చేయా లని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. జిల్లాకు ఇప్పటికే సుమారు రెండు లక్షల అయిదు వేల జవాబు పత్రాలు చేరుకున్నా యని తెలిపారు. ఇదిలా ఉండగా, మార్చి 24న ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం జియోగ్రఫీ పరీక్ష నిర్వహణతో ఇంటర్ పరీక్షలు ముగియనున్నాయని చెప్పారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యతో పాటుగా క్రీడలకు యువత సమప్రాధాన్యం ఇవ్వాలని పీబీ సిద్ధార్థ కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు చెప్పారు. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో అంతర్ కళాశాలల ఖో–ఖో (పురుషుల) పోటీలు ఫైనల్స్ మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాల ఆవరణలోని మైదానంలో శుక్రవారం జరిగాయి. ఫైనల్స్‌లో సిద్ధార్థ కళాశాల జట్టు మొదటి బహుమతిని, ఆంధ్రా లయోలా కళాశాల జట్టు రెండో, విజయ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్టు మూడో, వికాస్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్టు నాలుగో బహుమతిని సొంతం చేసుకున్నాయి. బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి వేమూరి బాబూరావు అతిథిగా హాజరై విజేతలకు బహుతులను అందజేశారు. సిద్ధార్థ కళాశాల వ్యాయామ ఉపాధ్యాయుడు డాక్టర్ టీవీబీ కృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఖో–ఖో అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎంవీఎస్‌ఎస్ ప్రసాద్ అభినందించారు.
చిట్టేల(వత్సవాయి): స్థానిక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి శుక్రవారం కేజీ వెండితో వక్షస్థల లక్ష్మీదేవి విగ్రహాన్ని అందజేశారు. మండలంలోని లింగాల గ్రామానికి చెందిన పసుపుల నర సింహారావు ఈ విగ్రహాన్ని తయారుచేయించి అందించారు. ఆలయ అర్చకులు సిరికొండ సాయికృష్ణమాచార్యులకు అందజేశారు. ఈ సందర్భంగా దాతను పూలమాల, శాలువాతో సత్కరించారు.


