పరాభవ.. విజయీభవ | - | Sakshi
Sakshi News home page

పరాభవ.. విజయీభవ

Mar 20 2026 9:17 AM | Updated on Mar 20 2026 9:17 AM

భక్తితో కొత్త సంవత్సరాదికి ఆహ్వానం పలికిన ప్రజానీకం ● దుర్గమ్మ సన్నిధిలో ఘనంగా ఉగాది వేడుకలు ● ఆరంభమైన వసంత నవరాత్రులు ● తొలి రోజున మల్లెలు, మరువంతో అర్చన ● వెండి రథంపై ఆదిదంపతులు

భక్తితో కొత్త సంవత్సరాదికి ఆహ్వానం పలికిన ప్రజానీకం

అమ్మవారి ప్రధాన ఆలయం నుంచి ఉత్సవ మూర్తితో ఊరేగింపుగా వస్తున్న ఆలయ ఈవో, చైర్మన్‌ తదితరులు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆదిదంపతులైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఉగాది వేడుకలు గురువారం వైభవంగా నిర్వహించారు. దుర్గమ్మకు తెల్లవారుజామున స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 8 గంటలకు దర్శనానికి భక్తులను అనుమతించారు. అమ్మవారి ఆలయంతో పాటు మల్లేశ్వరస్వామి వారి ఆలయం, ఉపాలయాల వద్ద విశేష పూలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలోని ప్రధాన ద్వారాలు, ప్రవేశ మార్గాల వద్ద అరటి చెట్టు, మామిడి ఆకులతో ముస్తాబు చేశారు.

వసంత నవరాత్రులు ప్రారంభం..

తొలుత ఆలయ ఈవో శీనానాయక్‌, చైర్మన్‌ రాధా కృష్ణ, ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రధాన ఆలయం నుంచి అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై నూతన పూజా మండపం వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తితో ఆలయ ఈవో, చైర్మన్‌ ముందుకు సాగారు. నూతన పూజా మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రతిష్టించి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మల్లెలు, మరువంతో పుష్పార్చన చేసి వసంత నవరాత్రులకు అంకురార్పణ చేశారు. తొలి రోజున 13 మంది ఉభయదాతలు సేవలో పాల్గొన్నారు. రూ. 2,500 టికెట్టు కొనుగోలు చేసిన భక్తులు పుష్పార్చనలో పాల్గొనవచ్చని ఆలయ అధికారులు పేర్కొన్నారు. పుష్పార్చన అనంతరం అమ్మవారికి సమర్పించిన పుష్పాలను భక్తులకు పంపిణీ చేశారు. ఇక సేవలో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు.

ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణం

నూతన పూజా మండపంలో పంచాంగ శ్రవణం జరిగింది. అంతకు ముందు శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన వేద పాఠశాలకు చెందిన విద్యార్థుల వేదపఠనంతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఆలయ అర్చకులు అమ్మవారికి, పంచాంగాలకు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి చల్లా శ్రీనివాసశర్మ పంచాంగ పఠనం చేశారు. చల్లా శ్రీనివాసశర్మకు ఆలయ స్థానాచార్య శివప్రసాద్‌ శర్మ పుష్పమాలను సమర్పించారు. పంచాంగ పఠనంలో 12 రాశుల స్థితిగతులు, ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానాలు, గ్రహ స్థితుల గురించి చక్కటి వ్యాఖ్యానంతో వివరించారు. ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం, నూతన యాగశాల దాత సంగా నరసింహరావు దంపతులను ఘనంగా సత్కరించారు. చైర్మన్‌, ఈవోలు వారికి నూతన వస్త్రాలు, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement