అకాల వర్షంతో రైతులకు అపార నష్టం | - | Sakshi
Sakshi News home page

అకాల వర్షంతో రైతులకు అపార నష్టం

Mar 20 2026 9:17 AM | Updated on Mar 20 2026 9:17 AM

● మాజీ మంత్రి జోగి రమేష్‌ ● కొటికలపూడిలో నేలవాలిన పంటల పరిశీలన ప్రభుత్వం ఆదుకోవాలి.. ● ఏటా నష్టపోతున్నాం..

రెండకరాల్లో మునగ, నాలుగెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. ఈదురు గాలులు, అకాల వర్షాలతో ఎకరన్నర మునగ, మూడెకరాల్లో మొక్కజొన్న నేలకొరిగింది. మునగకు రూ.80వేలు వరకు, మొక్కజొన్న రూ.2.50 లక్షలు మొత్తం రూ.3.30లక్షలు వరకు పెట్టుబడి పెట్టా. ఈసారి ఖర్చులు కూడా వచ్చేలా లేవు. కౌలు మరో రూ.1.50లక్షలు అయింది. ప్రభుత్వమే ఆదుకోవాలి.

– నాగేశ్వరరావు, రైతు, కొటికలపూడి

గతేడాది రబీ సీజన్‌లో రెంకరాల్లో మినుము పైరు సాగుచేశా. మోంథా తుపాను ప్రభావంతో పూర్తిగా నష్టపోయా. ఈసారి ఖరీఫ్‌లో మొక్క జొన్న సాగు చేశా. అకాల వర్షం, ఈదురు గాలులతో నేలమట్టం అయ్యింది. మరో 20 రోజుల్లో పంట చేతికొస్తుందనే తరుణంలో అకాల వర్షం నిండా ముంచింది. ఇప్పటికే రూ.2లక్షల వరకు పెట్టుబడి పెట్టా. చేతికి చిల్లిగవ్వ వచ్చేలా కనిపించడంలేదు.

– గోలుల సాంబశివరావు,

రైతు, కొటికలపూడి

కొటికలపూడి(ఇబ్రహీంపట్నం): అకాల వర్షంతో రైతులకు అపార నష్టం వాటిల్లిందని మాజీ మంత్రి జోగి రమేష్‌ అన్నారు. మండలంలో బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి నేలవాలిన పంట పొలాలను కొటికలపూడిలో గురువారం రైతులతో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పంటలకు జరిగిన నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతు అర్జా బాబూరావు మాట్లాడుతూ మరో 20, 30 రోజుల్లో పంట చేతికొచ్చేదని, ఈ దశలో పంట నేలపాలు అయ్యిందని వాపోయారు. ఇప్పటికే పంటకు పెట్టుబడిగా రూ.50వేలు నుంచి రూ.60వేలు వరకు అయిందన్నారు. కౌలు మరో రూ.30వేలు కలుపుకొంటే ఎకరానికి ఇప్పటికే రూ.90వేలు నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టినట్లు జోగి రమేష్‌కు తెలిపారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరారు. మరో రైతు బోళ్ల మునియ్య మాట్లాడుతూ ప్రస్తుతం యూరియా కట్ట రూ.2,500 వరకు పెరిగిందని పేర్కొన్నారు. వ్యవసాయంలో అన్ని ధరలు పెరిగాయని, రైతులకు గిట్టుబాటు ధర మాత్రం పెరగటం లేదని వాపోయారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో పంటలు నష్టపోతే పరిహారం అందించారని గుర్తు చేసుకున్నారు.

ఈ ప్రభుత్వంలో రైతులకు అన్నీ కష్టాలే..

జోగి రమేష్‌ మాట్లాడుతూ అకాల వర్షం రైతుల నడ్డి విరిచిన పరిస్థితి చూశామన్నారు. క్వింటా సుమారు రూ.2వేలు చొప్పున ఎకరాకు 50 క్వింటాలు అయితే ఎకరాకు రూ.లక్ష వరకు వచ్చేవన్నారు. గతంలో మోంథా తుపాను ప్రభుత్వంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. అంచనాలు వేసినా పరిహారం అందించలేని దిక్కుమాలిన ప్రభుత్వం అన్నారు. గత వైఎస్సార్‌ సీపీ హయాంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతులను గుండెల్లో పెట్టుకుని చూశారన్నారు. నేడు చంద్రబాబు ప్రభుత్వంలో రైతులను పలకరించే దిక్కు లేదని విమర్శించారు. ఎరువులు లేవు, విత్తనాలు లేవన్నారు. కృష్ణానది అవతల సీఎం చంద్రబాబు ఉన్నారని, ఇవతల రైతులు ఉన్నారన్నారు. అకాల వర్షాలతో మొక్కజొన్న, మునగ, రైతులు నష్టపోతే ఇప్పటి వరకు అధికారులు రైతులు, పంట పొలాల వైపు తిరిగి చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన పంటలకు తప్పనిసరిగా పరిహారం చెల్లించాలని వైఎస్సార్‌ సీపీ తరఫున డిమాండ్‌ చేస్తున్నామన్నారు. గతంలో వరదకు పసుపు పంట కోల్పోతే వైఎస్‌ జగన్‌ ఎకరాకు రూ.లక్ష ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు రైతులు, ౖ వైఎస్సార్‌ సీపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement