కనికుట్టు స్కీమ్‌! | - | Sakshi
Sakshi News home page

కనికుట్టు స్కీమ్‌!

Mar 20 2026 9:17 AM | Updated on Mar 20 2026 9:17 AM

● కుట్టుమిషన్‌ శిక్షణ ఇచ్చేందుకు ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలోని విజయవాడ సిటీలో 10సెంటర్లు, రూరల్‌ పరిధిలో జి.కొండూరు, కంచికచర్ల, వీరులపాడు, నందిగామ, చందర్లపాడు మండల కేంద్రాల్లో మొత్తం 15 సెంటర్లను ఏర్పాటు చేశారు. ● కృష్ణాజిల్లా పరిధిలో మచిలీపట్నం సిటీలో మూడు సెంటర్లు, పామర్రు, తోట్లవల్లూరు, ఉయ్యూరు, పమిడిముక్కల, చల్లపల్లి, అవనిగడ్డ, నాగాయలంక, పెనమలూరు, కంకిపాడు, గుడ్లవల్లేరు, నందివాడ మండల కేంద్రాల్లో మొత్తం 14 కుట్టు మిషన్‌ శిక్షణ సెంటర్లను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చారు.

మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు కలేనా?

బీసీ కార్పొరేషన్‌ ద్వారా పూర్తయిన శిక్షణ

ఏడు నెలలైనా పంపిణీ చేయని కుట్టు మిషన్లు

మిషన్‌ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న మహిళలు

ఉమ్మడి కృష్ణా జిల్లాలో శిక్షణ పొందిన 4,176మంది మహిళలు

జి.కొండూరు: ప్రభుత్వం మాటలు కోటలు దాటడం తప్ప చేతలు గడప కూడా దాటడం లేదనేది ఇప్పటికే పలు సందర్భాల్లో నిరూపితమైంది. స్కిల్‌ డెవలెప్‌ మెంట్‌లో భాగంగా బీసీ కార్పొరేషన్‌ ద్వారా మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కుట్టు మిషన్‌ శిక్షణ ఇచ్చి ఉచితంగా మిషన్‌లను పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టారు. శిక్షణ అయితే ఇచ్చారు కానీ ఏడు నెలలు గడిచినా మిషన్‌లను పంపిణీ చేయకపోవడంతో మహిళలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మిషన్‌లు ఇచ్చే లోపు నేర్చుకున్నది కూడా మరచిపోయేలా ఉన్నామని వాపోతున్నారు.

శిక్షణ ఇలా..

ప్రభుత్వం బీసీ కార్పొరేషన్‌ ద్వారా మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు స్కిల్‌ ట్రైనింగ్‌ పార్టనర్‌గా కర్డ్‌ అనే సంస్థకి బాధ్యతలను అప్పగించింది. ప్రభుత్వం సూచించిన మేరకు ఉమ్మడి కృష్ణాజిల్లాలో 29సెంటర్లను ఏర్పాటు చేసి ఒక్కొక్క సెంటర్‌కి రెండు బ్యాచ్‌లలో 144మంది చొప్పున 4,176మందిని శిక్షణకు ఎంపిక చేశారు. ఈ శిక్షణ కార్యక్రమం 2025, ఏప్రిల్‌ నుంచి ఆగస్టు మధ్య కాలంలో 90రోజులపాటు నిర్వహించారు. అనంతరం శిక్షణ పొందిన మహిళలకు నైపుణ్య పరీక్షను నిర్వహించి ఉచితంగా కుట్టు మిషన్‌లను పంపిణీ చేయాల్సి ఉంది. శిక్షణ పూర్తయ్యి ఏడు నెలలు గడిచినా ప్రభుత్వం నుంచి నిధుల విడుదలలో స్పందన లేకపోవడంతో సదరు సంస్థ పరీక్షను నిర్వహించలేదు. మిషన్‌లను పంపిణీ చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే దుస్థితి నెలకొనడంతో లక్షల మంది మహిళల మిషన్‌ల కోసం ఎదురు చూస్తున్నారు.

ఉమ్మడి కృష్ణాజిల్లాలో..

ఏడు నెలలుగా ఎదురు చూపులు..

కుట్టు మిషన్‌ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు ప్రభుత్వం మిషన్‌లు ఎప్పుడు పంపిణీ చేస్తుందో తెలియక నరకయాతన పడుతున్నారు. శిక్షణ కాలంలో వివిధ గ్రామాల నుంచి మండల కేంద్రాల్లో ఉన్న సెంటర్లకు వచ్చేందుకు 90రోజుల పాటు ప్రతి రోజూ రవాణా చార్జీలు, ఇతర ఖర్చులు కలిపి నెలకు రూ.10వేల వరకు సొంత డబ్బులు ఖర్చు చేశారు. అంతే కాకుండా ఇతర ఆదాయ మార్గాలను సైతం వదులుకొని శిక్షణ పొందామని. మిషన్‌లు పంపిణీ చేయకపోతే తామెలా బతకాలను వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి కుట్టు మిషన్‌లను పంపిణీ చేయకపోతే నేర్చుకున్నది కూడా మరిచిపోయాలా ఉన్నామని ఆవేదన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement