లబ్బీపేట(విజయవాడతూర్పు): ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో బహిరంగ ఈదుల్ ఫితర్ నమాజు నిర్వహించనున్నట్లు ముస్లిం ఈద్గా కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కాలేషావలీ, మునీర్ అహ్మద్ షేక్ తెలిపారు. ఈ సందర్భంగా ఈద్‌నమాజు నిర్వహించే ప్రాంగణంలో గురువారం నమాజు పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. డాక్టర్ కాలేషావలి, మునీర్ అహ్మద్ షేక్ మాట్లాడుతూ రంజాన్ రోజు ఉదయం 7. 30 గంటలకు ఈద్ సందేశం ప్రారంభమవుతుందని తెలిపారు. నమాజు ఉదయం 8 గంటలకు జరుగుతుందన్నారు. వజూ కోసం శుభ్రమైన నీరు అందుబాటులో ఉంటుందని, నమాజు నిర్వహించుకునేందుకు అనువుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈద్గా కమిటీ ప్రతినిధులు ఎండీ అన్వర్ పాష, ఎండీ ఇర్ఫాన్, ముఖ్తార్ అలీ, ఎండీ మొహిద్దీన్ పాల్గొన్నారు.
తిరువూరు ఆర్డీవోగా కుమార్
తిరువూరు: తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా ఏ. కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఒంగోలులో పౌరసరఫరాల విజిలెన్స్‌లో స్పెషల్ డెప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన బదిలీపై తిరువూరుకు వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న కె. మాధురి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో కుమార్‌ను ఆర్డీవోగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
హెచ్‌సీ శ్రీమన్నారాయణకు ఉత్కృష్ట సేవ పతకం
ఎ.కొండూరు: స్థానిక పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న బి.శ్రీమన్నారాయణ కేంద్ర ప్రభుత్వం అందించే ఉత్కృష్ట సేవ పతకానికి ఎంపికయ్యారు. విధి నిర్వహణలో చూపుతున్న అంకితభావం, క్రమశిక్షణ, ప్రజలతో సత్సంబంధాలు వంటి లక్షణాలకు గుర్తింపుగా ఆయనకు ఈ గౌరవం దక్కింది. పోలీస్ శాఖలో ఎన్నో ఏళ్లుగా నిబద్ధతతో సేవలందిస్తూ, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందుండే అధికారిగా శ్రీమన్నారాయణ స్థానికంగా మంచిపేరు ఉంది. శ్రీమన్నారాయణకు అవార్డు లభించడం పట్ల ఎ.కొండూ రు పోలీస్ సిబ్బంది, పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.


