కలెక్టరేట్‌లో
కంట్రోల్ రూం ఏర్పాటు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో వచ్చే మూడు రోజులపాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు. వాతావరణ, విపత్తుల నిర్వహణ శాఖ సూచనల మేరకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయవాడ నగరపాలక సంస్థ, మునిసిపల్, పంచాయతీ శాఖలు డ్రెయినేజీ వ్యవస్థల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడా నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని, పంటలకు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా మిర్చి రైతులను అప్రమత్తం చేయాలని కల్లాల్లోని మిర్చిని జాగ్రత్తగా భద్రపరచుకునేలా చేయూతనివ్వాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఆర్ అండ్‌బీ శాఖలు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా సిద్ధంగా ఉండాలని చెప్పారు.
సమాచారం ఇవ్వండి..
ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా స్థానిక అధికారులను వెంటనే సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో కూడా కమాండ్ కంట్రోల్ కేంద్రం (91549 70454 )అందుబాటులో ఉందని.. ఈ నంబర్‌కి కూడా ఫోన్ చేసి తెలియజేయవచ్చని కలెక్టర్ సూచించారు. జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండి ప్రజల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు. అకాల వర్షాలు, వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని.. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పంటలకు జరిగిన నష్టంపై రైతులకు పరిహారం అందుతోందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.


