సాక్షి నెట్‌వర్క్: ఉమ్మడి కృష్ణా జిల్లాలో బుధవారం మధ్యాహ్నం గాలి వాన బీభత్సం సృష్టించింది. అప్పటి వరకు ఎండ మండిపోగా ఒక్క సారిగా వాతావరణం మారిపోయింది. గాలి దుమారం మొదలైన కొద్ది సేపటికే ఆకాశం మేఘావృతమైంది. ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. గాలుల ధాటికి రహదారుల పక్కన ఏర్పాటు చేసిన హోర్డింగులు, ఫ్లెక్సీలు, పలు ప్రచార బోర్డులు నేలకూలాయి. జొన్న, మొక్కజొన్న, మునగ వంటి పంటలు నేల వాలాయి. ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం నియోజకవర్గాలతో పాటు, కృష్ణాజిల్లా పరిధిలో పెనమలూరు నియోజకవర్గంలో పంట నష్టం అధికంగా ఉంది. ఇబ్రహీంపట్నంలోని కొటికలపూడి, మూలపాడు, లంక గ్రామాల్లో నష్ట తీవ్రత అధికంగా ఉంది. వర్షంతో పొలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల నేలవాలిన చేలల్లో మొక్కజొన్న గింజలు మొలకెత్తే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు.
విస్సన్నపేట: స్థానిక విస్సన్నపేట–నూజివీడు రోడ్డులో రాణి కల్యాణమండపం సమీపంలో ఓ ట్రావెల్స్ బస్, మినీలారీ ఎదురెదురుగా ఢీ కొట్టుకోవడంతో.. బస్సు రోడ్డు సైడ్‌కు దూసుకెళ్లి ఆగిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో నాలుగు గ్రామాల నుంచి డ్రైవర్‌తో పాటు 42 మంది కలసి నిర్మలగిరి (గౌరీపట్నం )వెళ్లి.. తిరిగి వచ్చే క్రమంలో ఎదురుగా వస్తున్న మినీ లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు మార్జిన్‌లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్ డ్రైవర్ లక్ష్మణ్‌రెడ్డికి కాలు విరిగింది. ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఎస్‌ఐ అర్జున్ రాజు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని 108లో వైద్యానికి తరలించారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు.


