తెలుగు తమ్ముళ్లలో | - | Sakshi
Sakshi News home page

తెలుగు తమ్ముళ్లలో

Mar 18 2026 7:50 AM | Updated on Mar 18 2026 7:50 AM

కూటమి నేతలతో కొరవడిన సఖ్యత...

నియోజకవర్గ ప్రజా ప్రతినిధులతో...

పైకి కౌగిలింతలు...లోలోన దూస్తున్న కత్తులు

పార్లమెంటు, నియోజకవర్గ

ప్రజాప్రతినిధుల మధ్య పొరపొచ్చాలు

బీజేపీ నేతలకూ పొసగని వైనం

పార్లమెంటు ముఖ్యనేత కార్యాలయం

లో పనిచేసే వ్యక్తి పలువురి

కాల్‌లిస్టులు తెప్పిస్తున్నట్లు అనుమానం

తిరువూరులో రగులుతూనే ఉన్న

రావణకాష్ఠం

మైలవరంలో భగ్గుమంటూనే

ఉన్న వివాదం

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్‌ జిల్లాలో తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకుంటు న్నాయి. ముఖ్యంగా పార్లమెంటు ముఖ్యనేతకు, నియోజక వర్గ ప్రజాప్రతినిధులకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు చేరుకున్నాయి. ఇటీవల మైలవరంలో జరిగిన సీఐల బదిలీల విషయంలో నియో జకవర్గ ప్రజాప్రతినిధి సిఫారసులు చెల్లుబాటు కాలేదు. ఈ బదిలీల విషయంలో పార్లమెంటు ప్రజా ప్రతినిధి హస్తం ఉందని ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీంతో ఏకంగా నియోజకవర్గ ప్రజాప్రతినిధి, పార్లమెంటు ప్రజాప్రతినిధి కార్యాలయానికి వెళ్లి నిలదీయటం, తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం చర్చనీయాంశఽంగా మారింది, ఈ బదిలీల విషయంలో పార్లమెంటు ప్రజాప్రతినిధి కార్యాలయంలో పనిచేసే ఓ వ్యక్తి హస్తం ఉన్నట్లు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధి అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో మట్టితో పాటు పలు విషయాల్లో వీరి ఇద్దరి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి.

● తిరువూరులో పార్లమెంటు ముఖ్యనేత, నియోజకవర్గ ప్రజాప్రతినిధి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే ఉంది. అధిష్టానం జోక్యం చేసుకున్న తర్వాత కూడా వారి మధ్య మాటల మంటలు ఏమాత్రం ఆరటం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇద్దరి మధ్య బహిరంగంగానే వార్‌ నడుస్తోంది. ఇటీవల నెమలి ఆలయంలో వెంకటేశ్వర స్వామి కల్యాణంలో నియో జకవర్గ ప్రజాప్రతినిధికి ఘోర అవమానం చేశారు. అధికారికంగా పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయం నియోజకవర్గ ప్రజాప్రతినిధిది అయినప్పటికీ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో వీరి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. వీరు రెండు గ్రూపులుగా విడిపోయి బహిరంగంగానే ప్రెస్‌మీట్‌లు పెట్టుకుని తీవ్ర విమర్శలు చేసుకున్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి ప్రెస్‌మీట్‌ పెట్టి షాకింగ్‌ కామెంట్స్‌ చేయడం సంచలనంగా మారింది. నన్ను చంపేస్తారేమో అనే అనుమానం సైతం వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎస్సీ, ఎస్టీ లపై వేధింపులు అధికమయ్యామని, రౌడీయిజం, పేకాట క్లబులు, రేషన్‌ మాఫియా పెచ్చరిల్లుతున్నాయని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తమ్ముళ్ల అవినీతి వ్యవహారాలను బట్టబయలు చేశాయి.

పార్లమెంటు ముఖ్యనేతకు, కూటమి నేతలకు మధ్య సఖ్యత కొరవడింది. ఈ విషయం ఇటీవల వన్‌ టౌన్‌లో జరిగిన ఓ కార్యక్రమం ద్వారా బట్టబయ లైంది. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో పార్లమెంటు ముఖ్యనేత ఉన్నప్పటికీ, నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఓ సామాజిక వర్గం సమావేశానికి రాకపోవడం వీరి మధ్య అంతరాన్ని తేటతెల్లం చేసింది. దీనికితోడు బీజేపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధి కార్యాలయంలో పనిచేసే ఓ వ్యక్తి కాల్‌డేటాను పార్లమెంటు ముఖ్యనేత కార్యాలయంలో పనిచేసే వ్యక్తి తెప్పిస్తు న్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పలు నియో జకవర్గ ప్రజాప్రతినిధులు, వారి పీఏల కాల్‌ లిస్టు డేటాలు కూడా తెప్పిస్తున్నట్లు చర్చ సాగుతోంది. దీనికి కృష్ణాజిల్లాలో పనిచేసే ఓ పోలీసు అధికారి సహకరిస్తున్నట్లు పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.

పార్లమెంటు ముఖ్యనేతకు పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ నేతలతో సఖ్యత పూర్తిగా కొరవడింది. పైకి కౌగిలించుకున్నట్లు కనిపిస్తున్నా... లోలోన మాత్రం కత్తులు దూసుకుంటూనే ఉన్నారు. విజయవాడ ఈస్ట్‌, సెంట్రల్‌, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజా ప్రతినిధులకు, పార్లమెంటు ముఖ్యనేతకు మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు పార్టీ వర్గాల్లోనే బహిరంగంగా చర్చ సాగుతోంది. పార్లమెంటు ముఖ్యనేత ఒంటెద్దు పోకడలతో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులంతా దూరం జరిగినట్లు పార్టీ వర్గాలే పేర్కొనడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement