మైలవరం(జి.కొండూరు): ఎన్టీఆర్ జిల్లా మైలవరం తారకరామా నగర్‌లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంత్రి నారా లోకేశ్ మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోలేదంటూ ఈ నెల 10న విద్యార్థులు తమ ప్లేట్లలోని భోజనాన్ని బకెట్‌లో పడేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విద్యాశాఖ అధికారులు 11వ తేదీన పాఠశాలను తనిఖీ చేసి భోజనంలో లోపాలను గుర్తించి, వంట ఏజెన్సీ నిర్వాహకురాలిని తొలగించడంతోపాటు హెచ్‌ఎం జాన్‌ను సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన లోకేశ్... మధ్యాహ్న భోజనం విషయంలో తలెత్తిన వివాదంపై ఆరా తీశారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించారు. నాణ్యతా లోపం తలెత్తితే కఠిన చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయులు, వంట ఏజెన్సీ నిర్వాహకులను హెచ్చరించారు. అనంతరం మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. లోకేశ్ వస్తున్న విషయంపై స్థానిక ఎమ్మెల్యేకు, అధికారులకు సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.


