బీఆర్‌ నాయుడిని తప్పించండి | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ నాయుడిని తప్పించండి

Mar 18 2026 7:50 AM | Updated on Mar 18 2026 7:50 AM

హైందవ ధర్మాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు

భవానీపురం(విజయవాడపశ్చిమ): ‘‘అశ్లీల వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడిని పదవి నుంచి తప్పించండి..మీకు చేతకాకపోతే సీఎం పదవి నుంచి మీరు తప్పుకోండి’’ అని వైఎస్సార్‌ సీపీ నేతలు దేవినేని అవినాష్‌, మల్లాది విష్ణు, నల్లగట్ల స్వామిదాస్‌ డిమాండ్‌ చేశారు. తిరుమల పవిత్రతను మంటగలిపిన బీఆర్‌ నాయుడు రాజీనామా చేయాలని కోరుతూ తిరుపతిలో శాంతియుతంగా నిరసన చేపట్టిన వైఎస్సార్‌ సీపీకి చెందిన మహిళలపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడటమే కాకుండా తిరిగి బాధితులపైనే అక్రమ కేసులు బనాయించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఎన్టీఆర్‌ జిల్లా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల అంబేడ్కర్‌ విగ్రహం దగ్గర నిరసన చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వానికి, మహిళలపై లాఠీచార్జ్‌ చేసిన పోలీసులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

బీఆర్‌ నాయుడితో రాజీనామా చేయించాలి

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ చంద్రబాబుకు శ్రీవారిపై నిజమైన భక్తి ఉంటే బీఆర్‌ నాయుడితో రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేశారు. తన కులదైవం శ్రీవేంకటేశ్వరస్వామి అని చెప్పుకునే చంద్రబాబు, టీటీడీలో జరుగుతున్న ఘటనలకు కారణభూతుడైన బీఆర్‌ నాయుడిని ఎందుకు తప్పించటం లేదని ప్రశ్నించారు. పోలీసులు టీడీపీ కండువా కప్పుకుని పని చేస్తున్నారని విమర్శించారు. డ్రగ్స్‌ కేసులో పట్టుబడిన ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌పై చర్యలు తీసుకోకపోగా వెనకేసుకురావడం చంద్రబాబు నైజానికి తార్కాణమన్నారు.

జనజీవన స్రవంతిలో కలవకుండా చేయాలి

టీటీడీ చరిత్రలో మున్నెన్నడూ లేని విధంగా మచ్చ తీసుకువచ్చిన బీఆర్‌ నాయుడిని జనజీవన స్రవంతిలో కలవకుండా చేయాలని వైఎస్సార్‌ సీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నల్లగట్ల స్వామిదాస్‌ అన్నారు. చంద్రబాబుకు ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా వెంటనే బీఆర్‌ నాయుడితో రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేశారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయి స్టేషన్‌ బెయిల్‌పై బయటకు వచ్చిన మరునాడే పార్లమెంట్‌కు వెళ్లటం పార్లమెంట్‌ వ్యవస్థను అపహాస్యం చేసినట్టేనని అన్నారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్‌, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కానిపక్షంలో మీరు తప్పుకోండి

చంద్రబాబును డిమాండ్‌ చేసిన

అవినాష్‌, మల్లాది, స్వామిదాస్‌

తిరుపతిలో మహిళలపై దాడిని

ఖండిస్తూ నిరసన

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత హైందవ ధర్మాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని అన్నారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడి అశ్లీల వీడియోలు ప్రసార మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తుంటే అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పోలీసులు ఇకనైనా వారి తీరు మార్చుకోకపోతే భవిష్యత్‌లో తీవ్రపరిణామాలను ఎదుర్కోవల్సి వస్తుందని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement