తొలి రోజు ప్రశాంతం | - | Sakshi
Sakshi News home page

తొలి రోజు ప్రశాంతం

Mar 17 2026 7:51 AM | Updated on Mar 17 2026 7:51 AM

తొలి రోజు ప్రశాంతం

జిల్లాలో ప్రారంభమైన

‘పది’ పరీక్షలు

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో ఏర్పాటు చేసిన 149 కేంద్రాల్లో కేటాయించిన 27,249మంది రెగ్యులర్‌ విద్యార్థులకు గానూ, 27,043 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 206 మంది గైర్జాజరైనట్లు అధికారులు ప్రకటించారు. హాజరు శాతం 99.24శాతంగా నమోదైంది. తొలి రోజు ఫస్ట్‌ లాంగ్వేజ్‌ తెలుగు పరీక్షను నిర్వహించారు. అదేవిధంగా ఏపీ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించిన పరీక్షలకు 671 మందికి 16 పరీక్ష కేంద్రాలను కేటాయించారు. అందులో 546 మంది హాజరుకాగా 125 మంది గైర్హాజరయ్యారు. కేంద్రాల వద్ద ఆయా స్థానిక పోలీసుస్టేషన్ల పరిధి అధికారులు బందో బస్తు నిర్వహించారు. పరీక్ష కేంద్రానికి సకాలంలో విద్యార్థులు హాజరయ్యే విధంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్టీసీ సిబ్బంది ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రత్యేకంగా విధులు నిర్వహించారు. పరీక్ష కేంద్రంలోకి పరీక్షకు అరగంట ముందుగా విద్యార్థులను అనుమతించారు. జిల్లాలోని ఏ కేంద్రంలోనూ ఏ విధమైన మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదు.

పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌..

జిల్లాలో పదో తరగతి తొలిరోజు పరీక్షల నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ గవర్నర్‌పేట సీవీఆర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ హైస్కూల్‌ పరీక్ష కేంద్రాన్ని డీఈవో ఎల్‌.చంద్రకళతో కలిసి తనిఖీ చేశారు. సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, తాగునీరు, విద్యుత్‌, ఫ్యాన్లు, వైద్య శిబిరం వంటి సౌకర్యాలను పరిశీలించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్‌ లక్ష్మీశ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులు సజావుగా పరీక్షలు రాసేందుకు సౌకర్యాలు కల్పించామన్నారు. జిల్లాలో అమలుచేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ద్వారా ఈసారి పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

పారదర్శకంగా నిర్వహిస్తున్నాం: డీఈవో

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన డీఈవో ఎల్‌.చంద్రకళ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి పరీక్ష కేంద్రంలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. పరీక్షలు సజావుగా జరిగేలా కేంద్రాల వద్ద పర్యవేక్షిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement