దేవుడి భూమికి శఠగోపం? | - | Sakshi
Sakshi News home page

దేవుడి భూమికి శఠగోపం?

Jan 22 2026 8:33 AM | Updated on Jan 22 2026 8:33 AM

దేవుడ

దేవుడి భూమికి శఠగోపం?

కంకిపాడు: మండలంలోని ఉప్పలూరు గ్రామంలో దేవదాయ శాఖకు చెందిన రెండెకరాల భూమి మార్పిడి అంశం గోప్యంగా ఉంచటంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇటీవల ఆ శాఖ ఆర్‌జేసీ త్రినాథరావు, సిబ్బందితో కలిసి భూమి రికార్డులు, స్థానిక పరిస్థితులు పరిశీలించి వెళ్లటం, స్థానికులకు తెలియకుండా ఇదంతా జరగటం వెనుక ఆంతర్యంపై గ్రామస్తుల్లో తీవ్ర చర్చ సాగుతోంది. కంకిపాడు–గన్నవరం ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉన్న రూ.15 కోట్ల విలువైన భూమి గుండా ఓ గోదాము సంస్థ రోడ్డు నిర్మించి రాకపోకలకు వినియోగించుకుంటోంది. వ్యవసాయ భూమిని లీజుకు తీసుకుని వ్యవసాయేతర భూమిగా మార్చటంపై అప్పట్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైనా దేవదాయశాఖ నుంచి చర్యలు అంతంతమాత్రమే. ప్రస్తుతం ఈ భూమిని గోదాము నిర్వాహక ప్రతినిధులు వాల్చుకుని ఈ భూమి స్థానంలో మరికొంత భూమిని అప్పగించే ప్రతిపాదన దేవదాయ శాఖ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.

రియల్‌ ఎస్టేట్‌ చెరలో అమ్మవారి భూమి

ఇదే మండలం నెప్పల్లి గ్రామంలో అమ్మవారి భూమి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల చెరలో మగ్గిపోతోంది. గ్రామానికి చెందిన ఆర్‌ఎస్‌ నంబరు 101లో 4.41 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి ఆర్‌ఎస్‌ఆర్‌లో విజయవాడ కనకదుర్గ దేవస్థానానికి చెందినదిగానూ, అడంగల్‌లో కన్యకా పరమేశ్వరీ సత్రం భూమిగానూ నమోదైంది. ఈ భూమి విలువ ఎకరం రూ.5 కోట్లు పలుకుతోంది. దేవదాయశాఖ పరిధిలోని ఈ భూమిలో సుమారు 20 సెంట్ల భూమి గుండా దర్జాగా రోడ్డు వేసుకుని ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ 20 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో భారీ వెంచరు ఏర్పాటుచేసింది. ఓఆర్‌ఆర్‌ ఈ వెంచరు గుండానే వెళ్తుందని చెప్పి స్థలాలు అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నారు. అయితే వెంచరుకు వెళ్లే రోడ్డు మార్గం నిర్మించిన భూమి దేవదాయశాఖ పరిధిలోది కావటంతో స్థానికులు కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. దీనిపై ఆ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించి వెళ్లి వెంచరు నిర్మాణదారులు రోడ్డు నిర్మించిన భూమి ముమ్మాటికీ దేవదాయ శాఖది గానే తేల్చారు. రెండు పర్యాయాలు పరిశీలనలు చేసి వెళ్లారు. దేవదాయశాఖ కార్యనిర్వహణాధికారి రెవెన్యూ రికార్డులు సరిచేసి అమ్మవారి భూమి అమ్మవారికి చెందేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు లేఖలు పెట్టారు. అయితే నేటి వరకూ దేవదాయ శాఖ ఆ భూమిని తమ స్వాధీనం చేసుకోవటం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయటం జరగలేదు. వెంచరు నిర్మాణదారులు మాత్రం దర్జాగా రోడ్లు, ప్రహరీగోడలు నిర్మించుకుంటూ పనులు వేగంగా చేసుకుంటున్నారు. దీనిపై నేటికీ చర్యలు ఉపక్రమించకపోవటం అనుమానాలకు తావిస్తోంది. కోట్ల విలువైన భూమికి రక్షణ లేకుండా పోయిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

అధికారుల చర్యలపై పెదవి విరుపు

దేవదాయశాఖ అధికారుల చర్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెప్పల్లిలోని భూమిపై గ్రామస్తుల ఫిర్యాదుమేరకు అధికారులు గత ఏడాది మే నెలలో పరిశీలించి అది దేవదాయ శాఖ భూమిగానే నిర్ధారించారు. అయితే వారు వచ్చి వెళ్లి 8 నెలలైనా ఇంతవరకు ఆ భూమిని స్వాధీనం చేసుకోవడం కాని, అందులో కనీసం హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయటం కాని, వెంచరు నిర్వాహకులు వేసిన రోడ్డును ధ్వంసం చేయటం కాని ఇంతవరకు జరగలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఉప్పలూరులో భూమి మార్పిడి వ్యవహారంపై కూడా అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఉప్పలూరు భూమి విషయంలో గ్రామస్తులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు. భూమి మార్పిడికి అర్జీ దాఖలు చేసిన వ్యక్తులు ఎక్కడి భూమి కేటాయిస్తారన్నది ఆ శాఖ అధికారులకే స్పష్టత లేదు. స్పష్టత లేకుండా, విషయం గోప్యంగా ఉంచటం వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఆలయ భూములకూ రక్షణ కరువు

నెప్పల్లి అమ్మవారి భూమి

నేటికీ రియల్‌ ఆక్రమణలోనే...

తాజాగా ఉప్పలూరు భూమి మార్పిడికి సన్నాహాలు

భారీగా సొమ్ము చేతులు

మారుతున్నట్టు ప్రచారం

భూమార్పిడి అంశం గోప్యతతో

సర్వత్రా ఆందోళన

భూమికి బదులు భూమి ఇస్తారా?, భూమి విలువకు తగినట్లు భూమి కేటాయింపులు చేస్తారా? అన్నదానిపై స్పష్టత లేదు. భూమి మార్పిడికి ప్రతిపాదనలు అన్నారే కానీ ఎక్కడి భూమిని కేటాయిస్తారు? అన్నది తెలియకపోవటం, భూ మార్పిడి ప్రతిపాదనలపై అధికారుల పరిశీలన, స్థానికంగా గోప్యంగా ఉంచటంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాటి దాతల దాతృత్వం పెద్దలకు లాభం చేకూర్చటానికి కాదని, దేవుడి కోసం ఉపయోగపడాలని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూ మార్పిడి చర్యలను తిప్పికొడతామని స్థానికులు చెబుతున్నారు.

దేవుడి భూమికి సైతం రక్షణ కరువైంది. దేవుడి ఆస్తిని అప్పనంగా కాజేసేందుకు కొందరు పెద్దలు రెడీ అయ్యారు. భూమి మార్పిడిపై గోప్యంగా పరిశీలనలు జరగటం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో వైపు అన్యాక్రాంతమైన అమ్మవారి భూమిని పరిరక్షించే విషయంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. నేటికీ ఆ భూమి రియల్టర్ల ఆక్రమణ లోనే ఉంది. చంద్రబాబు పాలనలో దేవదాయశాఖ ఆస్తులకు భద్రత లేకుండా పోయిందన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

దేవుడి భూమికి శఠగోపం? 1
1/1

దేవుడి భూమికి శఠగోపం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement