వేడుకగా శ్రీశ్రీ కళావేదిక సాహిత్య పురస్కారాలు
విజయవాడ కల్చరల్: సమాజాన్ని చైతన్యపరిచే సాహిత్యం రావాలని శ్రీశ్రీ కళా వేదిక సీఈవో డాక్టర్ కత్తిమండ ప్రతాప్ అన్నారు. శ్రీశ్రీ కళావేదిక, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ రికార్డ్స్, గోదావరి సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బుధవారం జాతీయ సాహిత్య, సాంస్కృతిక పట్టాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ తెలుగు సాహితీ వైభవానికి కృషి చేయాల్సిన అవసరముందన్నారు. శ్రీశ్రీ కళావేదిక ద్వారా సాహిత్యంలో కనుమరుగవుతున్న సాహితీ ప్రక్రియలకు, సాహితీ మూర్తులకు సముచిత స్థానం కల్పిస్తున్నట్టు తెలిపారు. పోలీస్ అధికారి కొండా నరసింహారావు మాట్లాడుతూ శ్రీశ్రీ కళావేదిక ద్వారా డాక్టర్ కత్తిమండ ప్రతాప్ దేశంలో వివిధ ప్రాంతాలలో సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలను నిర్వహిస్తూ సాహితీవేత్తలను గుర్తించి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
సాహితీ పురస్కారాలు
తెలుగు సాహిత్యంలో విశేషమైన కృషి చేసిన వారికి, తెలుగు సాహితీ పరిశోధకులకు, వివిధ రంగాలకు చెందిన 300 మందికి నిర్వాహకులు ప్రాచీన కవుల వారసులు డాక్టర్ కావూరి శ్రీనివాస శర్మ, శ్రీనాథ మహాకవి వారసులు, ఏనుగు లక్ష్మణ కవి వారసులు డాక్టర్ శివరామప్రసాద్, భక్తరామదాసు వారసుడు కంచర్ల శ్రీనివాసరావు, శ్రీశ్రీ కళావేదిక నిర్వాహకులు పార్థసారథి, ఈశ్వరి చేతులమీదుగా పురస్కారాలను అందజేశారు. కవులు వర్తమాన సమస్యలను ప్రతిబింబిస్తూ స్వీయకవితా గానం చేశారు.


