రంగుల మండపం వద్ద భక్తుల సందడి
జగ్గయ్యపేట:పట్టణంలోని రంగుల మండపంలో కొలువై ఉన్న తిరుపతమ్మ గోపయ్య స్వామి వారి మంటపం వద్ద బుధవారం అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. పట్టణంలోని పలువురు మహిళలు అమ్మవారికి సారె సమర్పించారు. సుమారు అర కిలోమీటరు మేర భక్తులు బారులు తీరి మండపం వద్ద అమ్మవారిని దర్శించుకున్నారు. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం తరఫున అమ్మవారికి సారె సమర్పించారు. అమ్మవారి ఉత్సవ కమిటీ సభ్యులు కల్లూరి శ్రీవాణి, కాకులపాటి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక రైళ్లు పొడిగింపు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ఇప్పటికే నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల రద్దీ మేరకు మరికొన్ని రోజులు పొడిగించి నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్‌ఓ నుస్రత్ మండ్రుప్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సికింద్రాబాద్–అనకాపల్లి (07059) ఫిబ్రవరి 9 నుంచి 23 వరకు ప్రతి సోమవారం, అనకాపల్లి–సికింద్రాబాద్ (07060) ఫిబ్రవరి 10 నుంచి 24 వరకు ప్రతి మంగళవారం, చర్లపల్లి–అనకాపల్లి (07035) ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ప్రతి శనివారం, అనకాపల్లి–చర్లపల్లి (07036) ఫిబ్రవరి 15 నుంచి మార్చి 1 వరకు, పండర్‌పూర్–తిరుపతి (07032) ఫిబ్రవరి 1 నుంచి మార్చి 1 వరకు ప్రతి ఆదివారాల్లో నడపనున్నారు.
ప్రత్యేక రైళ్లు...
ప్రయాణికుల రద్దీ మేరకు ఈ నెల 23న శుక్రవారం చర్లపల్లి–కాకినాడ టౌన్ (07491), 26న సోమవారం కాకినాడ టౌన్–చర్లపల్లి (07492), 24న శనివారం కాకినాడ టౌన్–తిరుపతి (07493), ఈ నెల 25న తిరుపతి–కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్‌ఓ నుస్రత్ మండ్రుప్కర్ తెలిపారు.
దేవస్థానం పేరుతో వచ్చే ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దు
భవానీపురం(విజయవాడపశ్చిమ): కనకదుర్గమ్మ దేవస్థానం పేరుతో కొందరు భక్తులకు నకిలీ ఫోన్ కాల్స్ వచ్చినట్లు తెలిసిందని, అటువంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆలయ ఈఓ వీకే శీనానాయక్ బుధవారం ఒక ప్రకటనలో భక్తులను విజ్ఞప్తి చేశారు. గత కొద్ది రోజులుగా కొంతమంది వ్యక్తులు దేవస్థానం నుంచి అని చెప్పుకుంటూ భక్తులకు ఫోన్ చేసి మభ్యపెడుతున్నారని, సైబర్ మోసాలలో ఇదొక తరహా అయి ఉండవచ్చని అన్నారు. అపరిచితులు ఫోన్ చేసి అమ్మవారికి సమర్పించిన పట్టు చీరెలు ఇంటికి పంపిస్తామని లేదా మీ పేరుపై ప్రత్యేక పూజలు చేయిస్తామని నమ్మబలుకుతున్నట్లు సమాచారం అందిందని పేర్కొన్నారు. దేవస్థానం నుంచి భక్తులకు ఎటువంటి వ్యక్తిగత ఫోన్ కాల్స్ చేయమని, పూజలు చేస్తామని లేదా చీరెలు పంపిస్తామని వచ్చే ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దని స్పష్టం చేశారు. విరాళాల చెల్లింపులు కూడా దేవస్థానం వెబ్‌సైట్, మన మిత్ర వాట్స్ సేవ ద్వారా చేయాలని కోరారు.
లారీ డ్రైవర్
అనుమానాస్పద మృతి
కంచికచర్ల(వీరులపాడు): ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వ్యక్తి మృతి చెందిన ఘటనలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విశ్వనాథ్ తెలిపారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు కంచికచర్లకు చెందిన అనుమల రాజేష్ (36) లారీ ఓనర్ కం డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలం క్రితం సొసైటీ కార్యాలయం వెనుక భాగంలో ఇంటిని అద్దెకు తీసుకుని భార్య దుర్గ, నాలుగేళ్ల కుమారుడితో కలిసి ఉంటున్నాడు. తన కుమారుడు పుట్టుకతో మానసిక వైకల్యం కలిగి ఉండటంతో తన అత్తగారి ఊరైన ఖమ్మంలోని ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 17వ తేదీన భార్య, కుమారుడిని తీసుకుని ఖమ్మం వెళ్లాడని, మరుసటి రోజే తిరిగి రాజేష్ కంచికచర్లకు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఉదయం 10 గంటల సమయంలో రాజేష్ ఉంటున్న ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న ఎస్‌ఐ ఇంటి తలుపులు పగలగొట్టి వెళ్లి చూడగా రాజేష్ ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో భార్య దుర్గకు పోలీసులు సమాచారం అందించారు. భార్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


