గణతంత్ర స్ఫూర్తితో వేడుకలకు సిద్ధం కండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాస్థాయి గణతంత్ర దిన వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసి సన్నద్ధం కావాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ నెల 26న విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో జిల్లాస్థాయి 77వ గణతంత్ర దిన వేడుకల నిర్వహణపై బుధవారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ జేసీ ఇలక్కియతో కలిసి సమావేశంలో పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏడాది కాలంలో ప్రగతి పథాన్ని, సాధించిన విజయాలకు అద్దం పట్టేలా ప్రజలను చైతన్యవంతులను చేసేలా శకటాల ప్రదర్శన ఉండాలన్నారు. వేదిక ఏర్పాట్లు, పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్, భద్రతా చర్యలు, ప్రజలకు సౌకర్యాలు కల్పించడం వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. బందోబస్తు ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, కవాతు నిర్వహణ తదితరాలపై దృష్టి పెట్టాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ జి.లక్ష్మీశ


