ప్రతి అర్జీపై ప్రత్యేక దృష్టి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అందుతున్న ప్రతి అర్జీపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) కార్యక్రమం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ప్రతి అర్జీని లోతుగా పరిశీలించి, గడువులోగా పరిష్కరించి, తీసుకున్న చర్యల వివరాలను అర్జీదారులకు సరైనవిధంగా తెలియజేయాలని ఆదేశించారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో జిల్లాను రాష్ట్రస్థాయిలో ముందు వరుసలో నిలిపేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ముఖ్యంగా భూ సంబంధిత సమస్యలు, తాగునీరు, పారిశుద్ధ్యం, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. రెవెన్యూ సేవలతో పాటు ఇళ్ల స్థలాలు, ఇళ్ల మంజూరు, ఉపాధి, పెన్షన్ మంజూరు తదితరాలకు సంబంధించి మొత్తం 202 అర్జీలు స్వీకరించామన్నారు. వీటిలో రెవెన్యూకు సంబంధించి 49, పురపాలక పట్టణాభివృద్ధికి 40, వైద్య,ఆరోగ్యానికి 23, డీఆర్‌డీఏకు సంబంధించి 15, పోలీసు శాఖకు12, విద్యుత్ శాఖకు 9 అర్జీలు, మిగిలినవి వివిధ శాఖలకు సంబంధించి అర్జీలు అందాయన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ నాంచారరావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


