దీక్షల విరమణ ఏర్పాట్ల పరిశీలన
లబ్బీపేట(విజయవాడతూర్పు)/ భవానీపురం(విజయవాడ పశ్చిమ): భవానీ దీక్షల విరమణ బందోబస్తు ఏర్పాట్లపై ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, ఇతర అధికారులతో కలిసి ఆదివారం పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ నెల 11 నుంచి 15 వరకూ దీక్షల విరమణలు జరగనున్నాయి. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ పరిసరాలతో పాటు, గిరి ప్రదక్షిణ ప్రాంతాలను సందర్శించారు. పెద్ద సంఖ్యలో పలు ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారి మాలధారణ చేసి దీక్ష విరమణకు నగరానికి రానున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఇతర పోలీస్ అధికారులతో కలిసి టెంపుల్ పరిసర ప్రాంతాలను, స్నాన ఘాట్లను, హోమగుండాలు, ఇరుముడుల స్టాండ్ల ఏర్పాటు, ప్రదేశాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు
గిరి ప్రదక్షిణ సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లపై సూచనలు చేసి, దర్శన సమయంలో భక్తులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్యూ, దర్శనం అనంతరం భక్తులు వెళ్లే మార్గాలను పరిశీలించి పటిష్ట భద్రతకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. భవానీల సౌకర్యార్థం రెండు ఫుట్‌బ్రిడ్జ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో డీసీపీ కృష్ణకాంత్‌పాటిల్, ట్రాఫిక్ డీసీపీ షిరీన్‌బేగం, ఏసీపీలు డి.పవన్‌కుమార్, రామచంద్రరావు, సీఐలు పాల్గొన్నారు.


