చంద్రబాబు కంటే తుపానే నయం
మోపిదేవి(అవనిగడ్డ): చంద్రబాబు ప్రభుత్వం కంటే మొంఽథా తుఫానే నయమని అది సగం మంది రైతులనే నష్టపరచగా, ఈ ప్రభుత్వం రైతులందరినీ ముంచేసిందని వైఎస్సార్‌సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. రైతువిభాగం జోనల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబుతో కలసి కృష్ణాజిల్లా చల్లపల్లి, మోపిదేవి మండలాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. రహదారుల వెంబడి, పొలాల పక్కన ధాన్యం ఆరబోసిన రైతులతో మాట్లాడారు. మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లిలో రైతుసేవా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ రైతులను పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. ధాన్యం అమ్ముకునేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులపై మీడియాలో వార్తలు రావడం, వైఎస్సార్ సీపీ నాయకులు పల్లెల్లో పర్యటిస్తున్నందునే అధికారులు, సిబ్బంది కదిలారని అన్నారు.
ధాన్యాన్ని ఎందుకు కొనరు?.
సాగు ఆరంభంలో 1318 అనే రకం విత్తనాలను ప్రభుత్వమే సరఫరా చేసిందని, తీరా పంట పండించిన తరువాత ఆరకం ధాన్యాన్ని కొనకపోతే రైతులు ఏమై పోవాలని పేర్ని నాని ప్రశ్నించారు. విత్తనాలు, ఎరువులు సరిగా సరఫరా చేయలేకపోయిన ప్రభుత్వం, కనీసం రైతులు పండించిన ధాన్యాని అయినా మంచి రేటుకు కొనుగోలు చేయాలన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు.
మిల్లర్లపై ఆధారపడితే మీరెందుకు?
రైతులు చమటోడ్చి పండించిన ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు, బేరగాళ్ల (మధ్యవర్తుల) దయాదాక్షిణ్యాల మీద అమ్ముకోవాల్సిన ఆగత్యం ఏమిటని పేర్ని నాని ప్రశ్నించారు. నేడు ఎక్కడ చూసినా రైతులు ధాన్యాన్ని ఆరబోసుకునే దృశ్యాలే కనబడుతున్నాయన్నారు. రైతు సేవాకేంద్రాల్లో సంచులు అందుబాటులో లేవని, రైతులు ధాన్యాన్ని అమ్ముకోవాలంటే మిల్లర్లపైనే ఆధార పడాల్సి వస్తుందన్నారు. ఈ మాత్రం దానికి ప్రభుత్వం ఎందుకని నిలదీశారు. ఇదేనా సీఎం చంద్రబాబుకు ఉన్న 40 ఏళ్ల అనుభవం అని ప్రశ్నించారు. ఇందుకు చంద్రబాబే ఎందుకు? ఎవరిని కుర్చీ ఎక్కిచ్చినా సరిపోతుందిగా అంటూ ఎద్దేవా చేశారు. మొదట్లో ఎమ్మార్వోలు ధాన్యం కొనుగోలు చేసేవారని, తరువాత బ్యాంకులు, పీఏసీఎస్‌లు ద్వారా కొన్నారని, అవి కూడా పోయి ఈరోజు ప్రైవేటు వ్యక్తులతో కొనుగోలు కేంద్రాలను నడిపిస్తూ రైతుల వెన్నువిరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే కూటమి పార్టీలకు చెందిన ఒక్క ఎమ్మెల్యే కనబడకపోవడం శోచనీయమన్నారు.
మంత్రి నాదెండ్ల కనిపించరే..
మంత్రి నాదెండ్ల మనోహర్ నెలరోజుల కిందట ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చారని, అందులో హాయ్ అని మెసేజ్ పెడితే ఓయ్ అని మీ ఊర్లోకి వస్తామని చెప్పిన ఆయన ఒక్క ఊరికన్నా వచ్చారా అని పేర్ని నాని ప్రశ్నించారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా రోడ్లు వెంట, సందుల వెంట ధాన్యం పెట్టుకుని రైతులు ఇబ్బందులుపడుతుంటే ఓయ్ అంటూ మంత్రి నాదెండ్ల ఎందుకు రావడం లేదని నిలదీశారు.


