నేడు వైఎస్ జగన్ పర్యటన
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మోంథా తుపాను కృష్ణాడెల్టాకు తీరని నష్టం మిగిల్చింది. ఈదురుగాలులు, భారీ వర్షాలకు వరి పొలాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఉద్యాన పంటలైన బొప్పాయి, అరటి, కూరగాయ పంటలకు అపార నష్టం వాటిల్లింది. వరి దుబ్బులు మీదుగా వర్షపునీరు ప్రవహించింది. చిరుపొట్ట, గింజ గట్టిపడే దశలో వర్షం కురవటంతో తాలు,తప్ప గింజ ఏర్పడుతుందని, మానుగాయ వచ్చి పంట దిగుబడులు గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రైతులు ఒక్కో ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ పెట్టుబడులు పెట్టారు. పంట చేలు కోతకు సిద్ధమయ్యే దశలో వచ్చి పడ్డ తుపానుతో పెట్టుబడులు పూర్తిగా నీటిపాలైనట్టేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పంటలు డెబ్బతింటే ఎకరాకు రూ.25 వేలు ఇన్‌పుట్ సబ్సిడీ వచ్చిందని, ఇప్పుడు ఎకరాకు పంట నష్ట పరిహారం రూ.10వేలు ఇచ్చేందుకు సవాలక్ష నిబంధనలు పెడుతున్నారని రైతులు మండిపడుతున్నారు.
పంట నష్టం సర్వే లోనూ మెలిక
ప్రభుత్వం అడ్డగోలు నిబంధనలతో అన్నదాతలకు ఇక్కట్లు తప్పడం లేదు. సబ్సిడీ ఎగ్గొట్టడమే లక్ష్యంగా కుట్రలు సాగుతున్నాయి. పంట నష్టం పరిహారానికి సంబంధించి రైతులు రైతు సేవా కేంద్రాల వద్ద నమోదు కోసం వెళితే నష్ట పరిహారం కావాలంటే మీ ధాన్యం మేము కొనేది లేదని అధికారులు చెబుతున్నారని పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. రెండు రోజుల్లో పంట నష్టం అంచనాలు రూపొందించాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసినప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం అమలు కాలేదని రైతులు వాపోతున్నారు. తమకు రైతు భరోసా అందలేదని కౌలు రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తల్లడిల్లుతున్న రైతులు
తమ కళ్ల ముందే నేల వాలిన పంటను చూసి తల్లడిల్లిపోతున్నారు. ఎకరానికి కౌలు రూ.30 వేలు, పంట పెట్టుబడి రూ.35 వేలు మొత్తం గంగ పాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పది రోజుల్లో చేతికొచ్చే పంట పూర్తిగా నీళ్లలో నాని కుళ్లిపోతోందని, గింజలు మొలకెత్తుతాయని ఆందోళన చెందుతున్నారు. అరకొర మిగిలిన పంట కోయాలన్నా, మామూలు సమయంలో పంట కోతకు ఎకరాకు 2 గంటల సమయం పడితే, ఇప్పుడు 4 గంటల సమయం పడుతుందని, పైగా గింజలు రాలిపోతాయని, మిగిలిన అరకొర దిగుబడులు పంటకోత ఖర్చులకు కూడా రావని మథనపడుతున్నారు. ఒక వేళ కొంత మంది రైతులు ధైర్యం చేసి నేలకు వాలిన పంటను పైకి లేపి కట్టాలన్నా ఎకరాకు 100 మంది కూలీలు అవుతున్నారని, కూలీ రూ.330 చొప్పున రూ.33వేలు అవుతుందని వాపోతున్నారు.
నిలబడిన వరి పంటకూ నష్టమే...
మోంథా తుపాను వివిధ దశల్లో ఉన్న వరి పంటకు తీవ్ర నష్టం చేకూర్చింది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈనిక, చిరుపొట్ట దశలో ఉన్న పంటకు కనపడని నష్టాన్ని కలిగించింది. ఈదురు గాలులకు కంకులు ఒక దానికొకటి రాసుకుని తాలు..తప్ప కంకులు వస్తున్నాయి. చిరుపొట్ట మీద ఉన్న వరి కర్రలు పొట్టలు పగిలి దిగుబడులపైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ కారణంగా సరాసరి ఎకరాకు పది నుంచి 15 బస్తాలు దిగుబడి తగ్గి పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తుపాను ప్రభావానికి వరి పంట నేల వాలి పడిపోకుండా నిలబడి ఉన్న పంటకు కూడా నష్టం తప్పదని, పడిపోకుండా నిలబడిన వరి పంటకు ప్రభుత్వం నుంచి నష్టం కూడా రాదని రైతులు వాపోతున్నారు.
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పెనమలూరు సెంటర్, ఉయ్యూరు బైపాస్, పామర్రు బైపాస్ మీదుగా పెడన నియోజకవర్గంలోని గూడూరు చేరుకుంటారు. మోంథా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తారు. అక్కడ నుంచి హైవే మీదుగా తాడేపల్లి చేరుకుంటారు. ఈ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను కృష్ణా జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మచిలీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), పట్టణ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు సుబ్బన్న, చిటికెన నాగేశ్వరరావు పరిశీలించారు. జగన్ పర్యటన సాగే రామరాజుపాలెం నుంచి గొల్లపాలెం వరకు వరకు ప్రయాణించారు.


