కొండపల్లి కీర్తికి ఎస్‌పీఏ చేయూత
హస్తకళలు, పర్యాటక అభివృద్ధిలో ప్రతిష్టాత్మక సంస్థ భాగస్వామ్యానికి చొరవ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా లోని కొండపల్లి ప్రాంతంలో హస్తకళలు, పర్యాటక రంగ అభివృద్ధికి చేస్తున్న కృషిలో భాగంగా కొండ పల్లి బొమ్మల ఎక్స్‌పీరియన్స్ సెంటర్ అభివృద్ధిలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్‌పీఏ–విజయవాడ) సంస్థ భాగస్వామ్యానికి చొరవ చూపుతున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ లక్ష్మీశ ఎస్‌పీఏ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంతో పాటు దేశ, విదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందిన కొండపల్లి బొమ్మల ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటిచెప్పేలా, భవిష్యత్తు తరాలకు వారసత్వ సంపదగా అందించేలా చేపట్టిన ఎక్స్‌పీరియన్స్ సెంటర్ తోరణం (ఆర్చ్) అభివృద్ధి చేయాలన్నారు. కొండపల్లిని ఒక మోడల్ గ్రామీణ సృజనాత్మక ఆర్థిక కేంద్రంగా మార్చడానికి అవసరమైన ఆర్కిటెక్చర్, ప్లానింగ్‌కు సంబంధించి సహాయ సహకారాలు అందించాలని కోరారు. జిల్లా అధికార యంత్రాంగం, ఎస్‌పీఏ భాగస్వామ్యం కొండపల్లి బొమ్మలకు కొత్త వైభవం తేవడంతో పాటు యువత నేతృత్వంలోని కొత్త ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాల కల్పన, బ్రాండింగ్, ఎస్‌హెచ్‌జీ వ్యవస్థాపకత వంటి వాటికి ఉపయోగపడుతుందన్నారు. వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్ట్ (ఓడీపీడీ) కింద కొండపల్లి బొమ్మల కళాకారుల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దడంతో పాటు ఈ కళను తరతరాలకు వారసత్వ సంపదగా అందించేందుకు కృషిచేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. దీనిపై ఎస్‌పీఏ ప్రతినిధులు స్పందిస్తూ తమ సంస్థ డైరెక్టర్ సలహాలు సూచనలు, మార్గనిర్దేశనం మేరకు నిపుణులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు, డీపీఆర్ రూపకల్పనకు కృషిచేస్తామని చెప్పారు. కొండపల్లి కోటను కూడా పర్యాటకపరంగా మరింత అభివృద్ధి చేయడంపైనా సమావేశంలో చర్చించారు. సమావేశంలో ఎస్‌పీఏ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆర్‌ఎన్‌ఎస్ మూర్తి, డి.జగత్ కుమారి పాల్గొన్నారు.


