వర్సిటీ భూములు కృష్ణార్పణం
అన్యాక్రాంతం అవుతున్న గూడూరు భూములు వెంచర్లు వేసి మరీ ప్లాట్లుగా విక్రయం రెవెన్యూ, వర్సిటీ అధికారుల మధ్య సమన్వయ లోపం జాతీయ రహదారికి 100 మీటర్ల పరిధిలోనే ఉండటంతో ఆ భూములకు డిమాండ్ ఎకరం రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు విక్రయాలు
గూడూరు: ఉన్నత విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో కృష్ణా యూనివర్సిటీకి అంకురార్పణ చేశారు. మచిలీపట్నంలోని నోబుల్ కళాశాలలో మహానేత శిలాఫలకం ఆవిష్కరించగా, తర్వాతి కాలంలో నేషనల్ కాలేజీలో తాత్కాలికంగా యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. యూని వర్సిటీకి సొంత భవనాలు సమకూర్చడానికి ప్రభుత్వం 2010లో యూనివర్సిటీకి భూములు కేటాయించింది. మచిలీపట్నం మండలం రుద్రవరంలో 102 ఎకరాలు కేటాయించగా, గూడూరులో 44.92 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బందరు మండలం రుద్రవరంలో కేటాయించిన భూముల్లో యూనివర్సిటీ నిర్మాణం చేపట్టడంతో ప్రస్తుతం అక్కడి నుంచే పరిపాలన, తరగతుల నిర్వహణ సాగుతున్నాయి.
గూడూరులో 44.92 ఎకరాల కేటాయింపు
గూడూరు పటాన్‌పేటలోని సర్వే నంబరు 443/3లో 25.58 ఎకరాలు, కోకనారాయణపాలెం వెళ్లే రోడ్డు వెంబడి సర్వే నంబరు 393/1లో 19.00 ఎకరాలు వెరసి మొత్తం 44.92 ఎకరాలు యూనివర్సిటీకి కేటాయిస్తూ 2010లో అప్పటి కలెక్టర్ ఎలినేషన్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. వాస్తవానికి యూనివర్సిటీకి కేటాయించిన భూములన్నీ రెవెన్యూ రికార్డులలో ప్రభుత్వ భూములుగా నమోదయి ఉన్నప్పటికీ అనాది నుంచి స్థానిక రైతులు వాటిని సాగు చేసుకుని జీవనం సాగిస్తూ వచ్చారు. దీంతో తమ భూములను యూనివర్సిటీకి కేటాయించడంపై సర్వే నంబరు: 393/1లో అనుభవంలో ఉన్న రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం కోర్టులో వాయిదాలు నడుస్తున్నాయి.
అన్యాక్రాంతం అవుతున్న భూములు
ఇదిలావుండగా యూనివర్సిటీకి గూడూరు పటాన్‌పేటలోని 443/3లో కేటాయించిన భూములను అధికారులు పట్టించుకోకుండా వదిలేశారు. కనీసం భూముల చుట్టూ ఫెన్సింగ్ గానీ, సూచికలు గానీ, హద్దులు గానీ ఏర్పాటు చేయలేదు. దీంతో అనాది నుంచి భూములను సాగు చేసుకుంటున్న వారు ఇతరులకు అమ్మేసుకుంటున్నారు. 443/3 సర్వే నంబరులో మొత్తం 93.22 ఎకరాలు ఉండగా, దానిలో నుంచి యూనివర్సిటీకి 25.58 ఎకరాలు కేటాయించారు. మిగిలినవి ప్రైవేటు భూములు. దీంతో యూనివర్సిటీ భూములు సులువుగా రిజిస్ట్రేషన్ జరిగిపోతున్నాయి. కొందరు పక్కా భవనాలు కూడా నిర్మించేసుకుంటుండటం గమనార్హం.
వెంచర్లు వేసి మరీ విక్రయాలు
వర్సిటీ అధికారులు ఈ భూముల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో కొందరు వెంచర్లు వేసి ప్లాట్లుగా విక్రయించేస్తున్నారు. ఈ వ్యవహారంలో కింది స్థాయిలో ఉండే రెవెన్యూ సిబ్బంది ప్రత్యక్ష పాత్ర పోషిస్తుండగా ఆ శాఖలోనే ఉన్నత స్థానంలో ఉన్న అధికారులు మరికొందరికి పరోక్షంగా సహాయం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
జాతీయ రహదారికి సమీపంలో...
మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారికి ఈ భూములు 100 మీటర్ల పరిఽధిలోనే ఉండటంతో ప్రస్తుతం వీటికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఎకరం రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు సాగుతోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, మధ్య తరగతి ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు.
వర్సిటీ భూములు కృష్ణార్పణం


