అర్జీల పరిష్కారంలో అలసత్వం సహించం
అనుమతి లేకుండా గ్రీవెన్స్‌కు గైర్హాజరైతే చర్యలు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అర్జీల పరిష్కారంలో అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను హెచ్చరించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, ఇతర అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు అనుమతి లేకుండా గ్రీవెన్స్‌కు గైర్హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పునరావృతం కాకుండా అర్జీలకు పరిష్కారం చూపాల్సిందేనన్నారు. గ్రీవెన్స్ ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని అధికారులను కలిసేందుకు ఎంతో శ్రమతో, ఆశతో వస్తున్నారన్నారు. అర్జీదారుడు పెట్టుకున్న నమ్మకానికి వమ్ము చేయకూడదన్నారు. నిర్దేశించిన సమయానికి సమస్యలకు పరిష్కారం చూపాల్సిందేనని, ఈ విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించినా సహించబోనని కలెక్టర్ హెచ్చరించారు. సానుకూలతతో సమస్యలను పరిష్కరించడంపై దృష్టిపెట్టాలన్నారు. అర్జీల పరిష్కారంపై తాను ప్రతి రోజు సమీక్ష నిర్వహిస్తానని, సరైన కారణం లేకుండా జాప్యం చేసినా, నాణ్యత లేకున్నా సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ ద్వారా ప్రజల నుంచి 194 అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, డీఆర్‌డీఏ పి.డి ఏఎన్‌వీ నాంచారరావు, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.


