
రెడ్ క్రాస్ సేవలు ప్రశంసనీయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దుర్గగుడిలో జరిగిన దసరా మహోత్సవాల్లో రెడ్ క్రాస్ సంస్థ అందించిన సేవలు ప్రశంసనీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో రెడ్ క్రాస్ వలంటీర్ల అభినందన సభ గురువారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దసరా ఉత్సవాల్లో వృద్ధులు, దివ్యాంగులకు రెడ్ క్రాస్ వలంటీర్లు మంచి సేవలు అందించారని అభినందించారు. ఉత్సవాల విజయవంతంలో రెడ్ క్రాస్ పాత్ర కూడా ఉందన్నారు. ఉత్తమ సేవలు అందించిన వలంటీర్లకు కలెక్టర్ అభినందన పత్రాలు అందజేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ జి.సమరం మాట్లాడుతూ.. కేబీఎన్, పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాల, సిద్ధార్థ ఫార్మసీ కళాశాలల యూత్ రెడ్ క్రాస్ విభాగాల విద్యార్థులు ఒక షిఫ్ట్‌కు 20 మంది చొప్పున మూడు షిఫ్టుల్లో రోజుకు 60 మంది అమ్మవారి భక్తులకు సేవలందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ వెలగా జోషి, జిల్లా కార్యదర్శి ఇ.చిట్టిబాబు, సిద్ధార్థ ఫార్మసీ కళాశాల, కేబీఎన్ కళాశాల, పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాలల రెడ్ క్రాస్ యూత్ వింగ్ వలంటీర్లు, సమన్వయకర్తలు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ