కృష్ణలంక(విజయవాడతూర్పు): అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా ఈనెల 20వ తేదీన రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపడుతున్నట్లు రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు తెలిపారు. గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో శనివారం వారు మాట్లాడుతూ ట్రంప్ విఽధించిన సుంకాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రంప్ సుంకాల టెర్రరిజాన్ని ప్రపంచదేశాలపై రుద్దుతున్నాడన్నారు. ప్రత్యేకించి భారత దేశంపై కక్షతో సుంకాలను ఇతర దేశాలతో పోలిస్తే మరింత ఎక్కువగా వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్వారంగంపై పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలకు 19.2శాతం, ఈక్విడార్‌పై 13శాతం సుంకాలు విధించిన అమెరికా మనదేశంపై సుమారు 60శాతం సుంకాన్ని విధించిందని మండిపడ్డారు. ట్రంప్ హుంకరింపులతో ప్రధాని మోడీ 11శాతం దిగుమతి సుంకాన్ని ఎత్తివేసి పత్తి రైతులను దివాలా తీయిస్తున్నారని ఆరోపించారు. పౌల్ట్రీ రంగాన్ని నాశనం చేసేలా అమెరికాకు సహకరిస్తున్నారని విమర్శించారు. ట్రంప్ సుంకాల మోత కారణంగా ఎగుమతులపై సుమారు రూ.2.6లక్షల కోట్లు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ట్రంప్ సుంకాలు, అమెరికా సామ్రాజ్యవాద చర్యలను మోడీ ప్రభుత్వం, అన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు, సంఘాలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అమెరికా సామ్రాజ్యవాద ట్రంప్ సుంకాల యుద్ధానికి వ్యతిరేకంగా చేపడుతున్న ఉద్యమంలో రైతులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు, రైతు సంఘం నాయకుడు వై.కేశవరావు, ఎం.సూర్యనారాయణ పాల్గొన్నారు.