
నేటి అలంకారం
శ్రీరాజరాజేశ్వరీదేవి
దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ శ్రీరాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. చెరకుగడను వామహస్తంతో ధరించి, దక్షిణ హస్తంతో అభయాన్ని ప్రసాదిస్తూ, శ్రీషోడశాక్షరీ మహామంత్ర స్వరూపిణిగా శ్రీచక్రరాజ అధిష్టాన దేవతగా వెలుగొందే శ్రీ రాజరాజేశ్వరీదేవిని దర్శించి, అర్చించడం వలన సర్వ శుభాలు కలుగుతాయి. దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని అందరికీ అందింప చేసే అపరాజితా దేవిగా, చల్లనితల్లిగా శ్రీ కనకదుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరీదేవి అలం కారంలో దర్శనం ఇస్తుంది. అమ్మను సేవించి జీవితాన్ని ధన్యం చేసుకుందాం. సకల శుభాలు, విజయాలు శ్రీ అమ్మవారి దివ్య దర్శనం ద్వారానే మనకు లభిస్తాయి.