
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ
ప్యాకేజీల కోసమే
● పేద విద్యార్థుల కలలను కల్లలు చేస్తున్న కూటమి ప్రభుత్వం
● ప్రైవేటీకరణను విరమించి ప్రభుత్వమే కాలేజీలను నడపాలి
● వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్
ఆధ్వర్యంలో ప్రైవేటీకరణపై నిరసన
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్యాకేజీల కోసమే ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తోందని వైఎస్సార్ సీపీ నాయకులు విమర్శించారు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని సెయింట్ ఆన్స్ హాస్పిటల్ ఎదుట ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై నిరసన కార్యక్రమం జరిగింది. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పొలిమెట్ల శరత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యకుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, మొండితోక జగన్మోహనరావు పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి, విద్య, వైద్యం ప్రభుత్వ నిర్వహణలోనే ఉండాలని కోరుతూ తొలుత నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు ప్రసంగించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పిల్లలు వైద్య విద్య అభ్యసించాలనే తలంపుతో రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేయించారని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలోనే ఐదు కాలేజీల నిర్మాణం పూర్తయి, తరగతులు నడుస్తున్నాయని, మరో రెండు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ వైద్య కళాశాలల నిర్మాణాన్ని పూర్తి చేయకపోగా వాటిని ప్రైవేటీకరించేందుకు పూనుకుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ ప్యాకేజీల కోసం పీపీపీ విధానంలో తమకు కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు ప్రయత్ని స్తున్నారని విమర్శించారు. డాక్టర్ కావాలన్న లక్షల మంది పేద విద్యార్థుల కలలను కూటమి ప్రభుత్వం కల్లలు చేస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం దాచుకో.. దోచుకో విధానాన్ని అవలంబిస్తోందని ఎమ్మెల్సీ రుహుల్లా విమర్శించారు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు వాళ్లకు అప్పగించి దోచుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. వైద్య విద్యను, వైద్యాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ శీరంశెట్టి పూర్ణచంద్రరావు, బూదాల శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శులు వేల్పుల రమేష్, కన్నెగంటి జీవరత్నం, కోట దాసు, కొమ్ము చంటి, పొదిలి చంటి, జాన్ కెనడీ, కాలే పుల్లారావు, గుండె సుందర్‌పాల్, శామ్యూల్, తాడంకి రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి అవుతు శ్రీనివాసరెడ్డి, ఆళ్ల చల్లారావు, స్టూడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర, తంగిరాల రామిరెడ్డి, జానారెడ్డి, తోలేటి శ్రీకాంత్, బందెల కిరణ్‌రాజ్, దుర్గారెడ్డి, పలువురు కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ