
పాపం.. భవానీద్వీపం!
● భవానీ ద్వీపానికి దెబ్బ మీద దెబ్బ
● ద్వీపంలోకి ప్రవేశించిన వరద నీరు
● వృథాగా మారిన పునరుద్ధరణ పనులు
భవానీపురం(విజయవాడపశ్చిమ): నగరంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన భవానీ ద్వీపంపై ప్రకృతి పగబట్టిందా అంటే.. వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. గత ఏడాది ఆగస్ట్‌లో సంభవించిన వరద సందర్భంగా తీవ్రంగా (దాదాపు రూ.10 కోట్ల మేర అధికారుల అంచనా) నష్ట పోయిన భవానీ ద్వీపంలో పునరుద్ధరణ పనులు చేపట్టటంతో ఇప్పుడిప్పుడే పర్యాటకులు తిరిగి వస్తున్నారు. రిసార్ట్స్ బుకింగ్, రెస్టారెంట్, అడ్వంచర్ గేమ్స్, మిర్రర్ ఇమేజ్ వంటి కార్యకలాపాలు మళ్లీ మొదలవుతున్నాయి. ఈ తరుణంలో మళ్లీ వరద ఉధృతి పెరిగి సుమారు ఆరు లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజికి చేరింది. దీంతో భవానీ ద్వీపానికి మళ్లీ వరద తాకిడి తగిలింది. సోమవారం నాటికే వరద నీరు ద్వీపంలోకి చేరి అతలాకుతలం చేసింది.
పునరుద్ధరణ పనులు వృథాయేనా!
గత ఏడాది వరద కారణంగా ధ్వంసమైన ద్వీపానికి దెబ్బమీద దెబ్బ తగలటంతో చేసిన పునరుద్ధరణ పనులన్నీ వృథాయేనా అని పర్యాటక శాఖ అధికా రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయల వ్యయంతో ఆధునికీకరించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చామని, మళ్లీ వచ్చిన వరద పోటుతో ఈనగాచి నక్కల పాలైన విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు, వరదలు వెంటాడుతుంటే ఎప్పటికి కోలుకుంటాం..పర్యాటకులను ఆకర్షించే విధంగా ఎప్పటికి సిద్ధం చేయగలమని మథనపడుతున్నారు. హరిత బెరం పార్క్ (పున్నమి హోటల్) పరిస్థితి అలానే ఉండటం గమనార్హం. దసరా ఉత్సవాల సమయంలో అమ్మవారి దర్శనానికి వివిధ జిల్లాల ప్రజలు ఇక్కడికి వస్తారని, తద్వారా ఎంతో కొంత ఆదాయాన్ని పొందవచ్చని ఎదురు చూసిన పర్యాటక శాఖ వారికి నిరాశే ఎదురయింది.

పాపం.. భవానీద్వీపం!