
వేద మంత్రోచ్చరణతో మారుమోగిన ఇంద్రకీలాద్రి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం వేదసభ నిర్వహించారు. ఈ సభకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 450 మంది వేద పండితులు హాజరయ్యారు. మహామండపం ఆరో అంత స్తులో నిర్వహించిన సభ ప్రారంభానికి ముందు వేద పండితుల వేద మంత్రోచ్చరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. దుర్గగుడి వైదిక కమిటీ సభ్యుడు చింతపల్లి ఆంజనేయ ఘనాపాటి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దుర్గగుడి ఈఓ శీనానాయక్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన వేద పండితులను ఘనంగా సత్కరించి, అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ మర్యాదలతో అమ్మ వారి దర్శనం కల్పించారు.