నయనానందకరం.. శ్రీవారి కల్యాణం
తిరుమలగిరి(జగ్గయ్యపేట): పండు వెన్నెల.. మల్లె పందిరి.. రంగురంగుల విద్యుత్ దీపాల నడుమ ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ వేదికపై వాల్మీ కోద్భవ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం శనివారం రాత్రి నయనానందకరంగా జరిగింది. స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ వేడుకను నిర్వహించారు. స్వామి వారి ఉత్సవ మూర్తులతో కొండపైన ఉన్న ఆలయం నుంచి గ్రామంలో ఊరేగించి ఎదురు కోలోత్సవం జరిపించారు. అనంతరం కొండ కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంటపంలోకి విగ్రహాలను ప్రతి ష్టించి ఆలయ ప్రధానార్చకుడు తిరునగరి రామకృష్ణ మాచార్యులు, పరాంకుశం వాసుదేవాచార్యులు పర్యవేక్షణలో కల్యాణ వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ స్వామికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ చైర్మన్ భరద్వాజ్, పాలకవర్గ సభ్యులు, పలువురు దంపతులు పీటలపై కూర్చున్నారు. స్వామి కల్యాణాన్ని తిలకిం చేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వాసుదేవాచార్యులు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఐపీఎస్ అధికారి మనీషారెడ్డి ఆధ్వర్యంలో నందిగామ ఏసీపీ తిలక్, సీఐ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో జగ్గయ్యపేట, వత్సవాయి, చిల్లకల్లు ఎస్‌ఐలు రాజు, తోట శ్రీనివాస్ వంద మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఆలయ ఏసీ ప్రసాద్, ఇన్‌చార్జ్ తహశీల్దార్ మనోహర్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
నయనానందకరం.. శ్రీవారి కల్యాణం


