‘విశ్వావసు’లో కొత్త వెలుగులు
కలెక్టరేట్ వద్ద ఉగాది వేడుకల్లో పండితులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా దేవదాయ, ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ వెంకట రంగసాయి కుమార్ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. రాశి ఫలాలు వివరించారు. కొత్త తెలుగు సంవత్సరంలో ప్రతిఒక్కరి జీవితంలో ఆనందం, ఆరోగ్యం, సిరిసంపదలతో కొత్త వెలుగులు నిండాలంటూ వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. వేడుకల్లో పాల్గొన్న డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం మాట్లాడుతూ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సారథ్యంలో జిల్లా అన్ని రంగాల్లోనూ సమగ్రాభివృద్ధి చెందాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని.. ప్రజలందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. వేడుకల్లో భాగంగా వేద పండితులు వెంకట రంగసాయి కుమార్ శర్మతో పాటు దాములూరి అప్పయ్యశర్మ, వేదాంతం అజయ్‌కుమార్, తూములూరి కృష్ణమూర్తి, దుర్బాకుల సాంబమూర్తి అవధానిని సత్కరించారు.
బంగారు గరుడోత్సవం
మంగళగిరి టౌన్: మంగళాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఉదయం ఉగాది తిరువంజనోత్సవంతోపాటు స్వామికి శాంతి కల్యాణం నిర్వహించారు. మధ్యాహ్నం ఉగాది సందర్భంగా శనగల శేషాంజనేయ గోపాల్ పంచాంగ పఠనం చేశారు. సాయంత్రం 6 గంటలకు స్వామి బంగారు గరుడోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని తరించారు. అదాందల మహల్ పవళింపు సేవలో గులాబీ పువ్వులతో సహస్ర నామార్చన నిర్వహించారు.


