
సమావేశంలో మాట్లాడుతున్న కె. రామకృష్ణ
పటమట(విజయవాడతూర్పు): దేశంలో మత రాజకీయాలు చేసే బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ సంఘ సంస్కర్త, నాస్తిక ఉద్యమ నిర్మాత గోపరాజు రామచంద్రరావు (గోరా) 121 వ జయంతి సభ బెంజిసర్కిల్ సమీపంలోని నాస్తిక కేంద్రంలో బుధవారం నిర్వహించారు. లౌకిక రాజ్య పరిరక్షణలో అభ్యుదయ వాదుల పాత్ర అనే అంశంపై నిర్వహించిన సదస్సులో రామకృష్ణ మాట్లాడారు. దేశానికి ప్రమాదకరంగా భారత రాజ్యాంగాన్ని మార్చటమే
ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన అజెండాగా పాలన చేస్తుందని, ప్రగతిశీల లౌకిక ప్రజాతంత్ర శక్తులు ఐక్యంగా బీజేపీ కూటమని ఓడించాలని పిలుపునిచ్చారు. మోడీ తొమ్మిదేళ్ల పరిపాలనలో ప్రశ్నించే మేధావులు, హేతువాదులైన దబోల్కర్, గోవింద పన్సార్, గౌరీ లంకేష్ వంటి వారిని హత్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ నాస్తికులు మోతుకూరి అరుణ కుమార్ మాట్లాడుతూ విద్యా రంగంలో సంస్కరణలు పేరుతో విశ్వవిద్యాలయాల స్థాయిలో కాషాయీకరణ చేస్తున్నారని ధ్వజమెత్తారు. మూఢ నమ్మకాలు నిర్మూలన కోసం సంస్కరణ ఉద్యమం చేపట్టిన గోరా, పెరియార్, త్రిపురనేని, గురజాడ వంటి వారిని ఆదర్శంగా తీసుకుని నాస్తిక ఉద్యమాన్ని ముందుకు నడిపించే బాధ్యత నేటి తరంపై ఉందని తెలిపారు. ప్రముఖ వైద్యులు జి.సమరం మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో కులమతాలు ధ్రువీకరణ లేని నాస్తికులు కోసం ప్రత్యేక కాలం ఉంచాలని కోరారు. ఇస్కఫ్ నాయకులు మహబూబ్ ఆజం, ప్రజా నాట్యమండలి రాష్ట్ర కోశాధికారి ఆర్.పిచ్చయ్య, జి.నియంత, డాక్టర్ మారు, రష్మి తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ