గన్నవరం: వేర్వేరు చోరీ కేసుల్లో ఇరువురు నిందితులకు తొమ్మిది నెలలు చొప్పున జైలుశిక్ష విధిస్తూ గన్నవరం 12వ ఏఎంఎం కోర్టు తీర్పు ఇచ్చింది. వివరాలు ఇవి.. 2020 సెప్టెంబర్ 6న కేసరపల్లిలో మూల్పూరి పద్మావతి ఇంటికి పాత టీవీలు కొనుగోలు చేస్తామని వచ్చిన ఘంటసాల మండలం శ్రీకాకుళంకు చెందిన గరికే సుబ్బారాజు ఆమె మెడలోని ఆరు కాసుల బంగారు గొలుసును తెంపుకొని బైక్‌పై పరారయ్యాడు. ఈ ఘటనపై అప్పట్లో గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు విచారణలో రుజువు కావడంతో నిందితుడు సుబ్బారాజుకు తొమ్మిది నెలల జైలు శిక్ష విధిస్తూ 12వ ఏఎంఎం కోర్టు కోర్టు బి. శిరీష తీర్పునిచ్చారు.
సెల్‌ఫోన్ చోరీ కేసు నిందితుడికి..
గుంటూరు జిల్లా గొడవర్రుకు చెందిన పీతా వెంకట ఫణికుమార్ స్థానిక విద్యానగర్‌లోని బాయ్స్ హాస్టల్ ఉంటూ కేసరపల్లిలోని ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో 2021 డిసెంబర్ 18న ఇరువురు స్నేహితులతో కలిసి విజయవాడలో సినిమా చూసేందుకు రాత్రి బయలుదేరారు. కేసరపల్లి వద్దకు రాగనే వెనుక నుంచి బైక్‌పై వచ్చిన తెలంగాణలోని సరూర్‌నగర్‌కు చెందిన ధరవత్తు రమేష్ వీరిని అడ్డుకున్నాడు. పోలీస్‌నని చెప్పిన రమేష్ త్రిపుల్ రైడింగ్ చేస్తున్నారని వారిని బెదిరించి ఫణికుమార్ సెల్‌ఫోన్ తీసుకుని వెళ్లిపోయాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో నేరం రుజువు కావడంతో రమేష్‌కు 9 నెలల జైలుశిక్షను 12 ఏఎంఎం కోర్టు జడ్జి విధించారు.


