వర్జీనియాలో కొలకలూరి ఇనాక్‌తో ఆత్మీయ సమ్మేళనం!

A Spiritual Gathering Of Telugu Literature In Virginia USA - Sakshi

అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ప్రముఖ కవి, కథా-నవలా రచయిత, వ్యాసకర్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. అక్టోబరు 7న లోటస్ టెంపుల్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ అవధానులు శ్రీ నరాల రామిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని కథా-నవలా రచయిత, ఫిలిం మేకర్, ఇనాక్ అమెరికా పర్యటన పర్యవేక్షకులు వేణు నక్షత్రం ఆధ్వర్యంలో, సాహిత్యాభిమానులు వాషింగ్టన్ సాహితీ సంస్థ నిర్వాహకులు రవి వేలూరి, సాహిత్యాభిమానులు ప్రసాద్ చెరసాల, కవి చంద్ర కాటుబోయిన, పవన్ గిర్లా, ప్రవీణ్ దొడ్డల సంయుక్త నిర్వాహణలో జరిగింది.

ఈ సందర్భంగా ఇనాక్ మాట్లాడుతూ ఈ ప్రపంచంలో దేన్ని అయినా, ఎంతటి కఠినాత్ములని అయినా ప్రేమతో మాత్రమే జయించవచ్చని, శత్రువుని ఎదిరించడానికి సాహిత్యాన్నే ఆయుధంగా ఉపయోగించానని తెలిపారు. బలహీనులని పీడిస్తే , ఏదో ఒకరోజు వారు తిరగబడతారని బలవంతులు గ్రహించాలని అన్నారు. తన రచనలన్నీ సమాజంలోజరిగిన సంఘటనలే అని వాటి ద్వారా కొంత నయినా అవగాహన కల్పించడమే తన ఉద్దేశ్యం అని పేర్కొన్నారు. సభాధ్యక్షులు నరాల రామిరెడ్డి మాట్లాడుతూ, ఇనాక్ సభలో అధ్యక్షత వహించడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఇనాక్ రచనలు చాలా చదివానని, సాహిత్యంలో కథ, నవల, పద్యం, వ్యాసం ఇలా ప్రతి అంశాన్ని సృజించి ప్రతి ప్రక్రియలో అవార్డులు పొందిన ఘనత ఇనాక్ గారిదే అని అన్నారు.

సభా నిర్వాహకులు వేణు నక్షత్రం మాట్లాడుతూ.. ఇనాక్కి ఇప్పటికే వచ్చిన ఎన్నో అవార్డులతో పాటు ఉత్తమ తండ్రి అనే అవార్డు కూడా ఇవ్వాలని అన్నారు. ఎందుకంటే ఇనాక్ తన ముగ్గురు పిల్లలు ఎలాంటి రిజర్వేషన్లు ఉపయోగించకుండా కేవలం ప్రతిభతో అత్యుత్తమ చదువులు చదివి సమాజంలో అధ్యాపకులుగా, క్లాస్ వన్ ఉద్యోగులుగా తీర్చిదిద్దడంలో ఇనాక్ గారి సాహిత్యం ఎంతో ఉపయోగపడిందని వేణు నక్షత్రం అన్నారు. ఇనాక్ రాసిన మునివాహనుడు కల్పిత నవల అంశం ఇప్పుడు సమాజంలో మునివాహన సేవగా ప్రాచుర్యం పొందడం లాంటి ఘనత ఇనాక్ రచనలకే చెందిందని కొనియాడారు.

రవి వేలూరి , రమేష్ రావెళ్ల గారు ఇనాక్ని, నరాల రామిరెడ్డి ని శాలువాతో సత్కరించారు. కాపిటల్ ఏరియా తెలుగు అధ్యక్షులు సతీష్ వడ్డీ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ప్రతీ సంవత్సరం ఒకసారి ప్రత్యేక సాహిత్య సమావేశాలు నిర్వహించడానికి ప్రయత్నిసానని అన్నారు. అమెరికాలో తెలుగు సంస్థలు ప్రతి రెండేళ్ళకోసారి కోట్ల ఖర్చుతో సదస్సు నిర్వహిస్తారని, అందులో సాహిత్యానికి తగిన ప్రాముఖ్యత లభించడం లేదని, అందుకే ప్రతి సంవత్సరం ఒక సారి ప్రత్యేక సాహితీ సమావేశాలు నిర్వహిస్తే, తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించిన వారవుతారని వేణు నక్షత్రం తెలుగు సంఘాలని కోరారు. వాషింగ్టన్, మేరీలాండ్, వర్జీనియా ప్రాంతంలోని సాహిత్యాభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

(చదవండి: సింగపూరులో ఘనంగా తెలుగుతోరణం వేడుకలు)

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top