సింగపూరులో ఘనంగా తెలుగుతోరణం వేడుకలు | Sakshi
Sakshi News home page

సింగపూరులో ఘనంగా తెలుగుతోరణం వేడుకలు

Published Tue, Oct 10 2023 5:54 PM

Grand Telugu Toranam Celebrations In Singapore - Sakshi

సింగపూరు తెలుగు టీవీ వారు నిర్వహించిన తెలుగుతోరణం తెలుగు నీతిపద్యాల పోటీ చివరి వృత్తం దాదాపు మూడు వందల ప్రేక్షకుల నడుమ, ప్రత్యక్ష ప్రసారంగా ఘనంగా నిర్వహించారు. సింగపూరు తెలుగు ప్రముఖులు డా. బి. వీ. ఆర్. చౌదరి, రాజ్యలక్ష్మి దంపతులతో పాటుగా సింగపూరు నందు ఉన్న తెలుగు సంస్థలు సింగపూరు తెలుగు సమాజం, తెలంగాణా కల్చరల్ సొసైటీ సింగపూరు, కాకతీయ సాంస్కృతిక పరివారము, శ్రీ సాంస్కృతిక కళా సారధి, పోతన భాగవత ప్రచార సమితి సంస్థల ప్రతినిధులతో పాటుగా తెలుగు సమూహాలు అయిన మనం తెలుగు, అమ్ములు, తెలుగు వనితలు, ప్రాడ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు హాజరయ్యి ఈ కార్యక్రమం ఆసాంతం వీక్షించి తమ అభినందలను తెలియచేసారు.

కార్యక్రమ తదనంతరం నిర్వహకులు వారిని కృతజ్ఞతా జ్ఞాపికలతో సత్కరించారు. అదే విధంగా కార్యక్రమం అనుకున్నది మొదలు ఎందరో తమంత తాముగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమ నిర్వహణకుగా తమ వంతు సహాయ సహకారాలు అందించారు. వారిని కూడా ఈ వేదిక మీద సత్కరించడం జరిగింది. సుమారు 20 మంది చిన్నారులతో పది వారాల పాటు జరిగిన ఈ పద్యాల పోటీ సింగపూరులోనే మొట్టమొదటి తెలుగు రియాలిటీ షోగా నిలిచి ఇక్కడ ఉన్న చిన్నారులలోని తెలుగు ప్రతిభా పాటవాలను వెలుగులోకి తీసుకొచ్చింది.

ఎన్నెన్నో పద్యాలు నేర్చుకుని, పద్యం చెప్పడమే కాకుండా దాని భావాన్ని, అర్ధాన్ని ఉదాహరణలతో, చిన్ని చిన్ని నీతి కథలతో సహా వివరించడం ఈ పోటీపై వారికున్న ఇష్టాన్ని, శ్రద్దను తెలియ చేసింది, ప్రేక్షకులను అలరించింది. చిన్నారుల తల్లి తండ్రులు మాట్లాడుతూ ఈ పోటీ వల్ల తమకు కూడా మరొక్కసారి ఈ నీతి పద్యాలను చదువుకునే అవకాశం కలిగిందన్నారు. దాని అర్ధాలు ఇప్పటి సమాజానికి ఎలా వర్తిస్తాయో కూడా అన్వయించుకోవడం వల్ల ఈ పోటీ తమకు కూడా జీవితానికి ఒక రివిజన్ లా అనిపించిందని చెబుతున్నారు. అలాగే ఈ కార్యక్రమం చూసిన స్పూర్తితో ఇంటి వద్ద తమ చిన్నారులు కూడా తెలుగు నీతి పద్యాలను నేర్చుకుంటున్నారు అని కార్యక్రమానికి హాజరైన తెలుగు వారు తెలియచేయడం జరిగింది.

ఈ పోటీలో మొదటి స్థానంలో ఓరుగంటి రాధా శ్రీనిధి, రెండవ స్థానంలో సూదలగుంట ఆరాధ్య మూడవ స్థానంలో సింగిరెడ్డి శ్రీనిత విజేతలుగా ఎన్నికయ్యారు. విజేతలతో పాటుగా కార్యక్రమంలో పాల్గొన్న పోటీదారులందరికీ తెలుగు ప్రముఖులలు జ్ఞాపికలు అందించడంతో పాటుగా దాదాపు 3 వేల డాలర్ల వరకూ నగదు బహుమతులు కూడా అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారికీ అలాగే సాంస్కృతికి కార్యమాలు ప్రదర్శించిన వారు అందరికీ తెలుగు ప్రముఖుల చేతుల మీదుగా జ్ఞాపికలు ప్రధానం చేయడం జరిగింది. అదే విధంగా కార్యక్రమాన్ని, పోటీలో పాల్గొన్న చిన్నారులనూ దీవిస్తూ శసాయి కుమార్, తనికెళ్ళ భరణి, రారాధికా, భువన చంద్ర వంటి సినీ ప్రముఖులు పంపిన వీడియో సందేశాలను కూడా వేదిక మీద ప్రదర్శించడం జరిగింది.

కార్యక్రమ నిర్వాహకులు రాధా కృష్ణ గణేశ్న, కాత్యాయని గణేశ్న మాట్లాడుతూ సింగపూరు నందు ఉన్న అన్ని తెలుగు సంస్థలూ అలాగే అందరు తెలుగు ప్రముఖులూ ఒకే సారి ఈ వేదిక మీదకు వచ్చి తమకు ఆశీర్వాదాలు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు.  అన్ని తెలుగు సంస్థల ఆశీస్సులతో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం తమ కల అని అది ఈ రోజు నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే తమ తమ చదువులతో బిజీగా ఉన్నా తెలుగు భాష మీద మక్కువతో పద్యాలు నేర్చుకుని కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు, వారికి శిక్షణ ఇచ్చిన తల్లి తండ్రులకు కృతజ్ఞతలు తెలియచేసారు నిర్వాహకులు. ఇది తెలుగు భాషకు తమ వంతుగా చేసుకున్న ఒక చిన్న సేవ అని సగర్వంగా చెప్పారు.

ఇంత పెద్ద వేదిక మీద ఇంతటి పెద్ద కార్యక్రమం పది భాగాలుగా నిర్వహించగలగడం అందరి తెలుగు వారి సహకారంతో మాత్రమే సాధ్యమైందన్నారు.  అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రమం స్పూర్తితో ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు సింగపూరు నుంచి వస్తాయని ఆశిస్తున్నామని వాటికి తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. ఈ నీతి పద్యాల పోటీకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన రాంబాబు పాతూరి, అపర్ణ గాడేపల్లి మరియు సౌభాగ్యలక్ష్మి తంగిరాల వారికి ధన్యవాదాలు తెలిపారు.

ఆ న్యాయ నిర్ణేతలు ఈ కార్యక్రమ ప్రణాళికలో పాలుపంచుకుని పిల్లలకు అనువైన పద్యాలను ఎంపిక చేసి అందించడమే కాకుండా పిల్లలు చెప్పిన ప్రతి పద్యానికీ వివరణాత్మకమైన విశ్లేషణ చేయడమే గాక మరింత కొత్తదనంతో ఎలా నేర్చుకోవచ్చో సలహాలు అందించి వారిని ప్రోత్సహించారు. అలాగే వ్యాఖ్యాతలుగా కవిత కుందుర్తి, సుబ్బు పాలకుర్తి చిన్నారులు వేదిక మీద భయం లేకుండా పద్యాలు చెప్పేలా వారిని ఉత్సాహ పరిచి సరదా సరదా సంభాషణలతో కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేశారన్నారు నిర్వాహకులు రాధ కృష్ణ గణేశ్న, కాత్యాయని గణేశ్నలు. 

(చదవండి: యూకేలో గాన గంధర్వునికి ఘనంగా సంగీత నివాళి!)

Advertisement
 
Advertisement