అమెరికాలోని చార్లెట్ నగరంలో సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు మాట్లాట 2026 అంతర్జాతీయ పోటీలు హిల్టన్ చార్లెట్ ఎయిర్‌పోర్ట్ రిసార్ట్ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. పారుపూడి కిరణ్, తాళ్లూరి ప్రత్యూష, గొల్లపూడి సీతారామ్ నాయకత్వంలో జరిగిన ఈ పోటీల్లో అమెరికా, కెనడాలోని పలు ప్రాంతాల నుంచి 200 మందికి పైగా తెలుగు పిల్లలు పాల్గొన్నారు. దాదాపు 1000 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ప్రముఖ నటుడు, దర్శకుడు, సంగీత విద్వాంసుడు శ్రీ ప్రభల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
తెలుగు భాషా నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ పోటీల్లో పదరంగం (తెలుగు పదాలు వ్రాసే ఆట), తిరకాటం (తెలుగు ప్రశ్నోత్తరాల ఆట), ఒనిమా – ఒక్క నిమిషం మాత్రమే (తెలుగులో మాట్లాడే ఆట) అనే మూడు విభాగాల్లో బుడతలు (5–7), సిసింద్రీలు (8–11), చిరుతలు (12–16) వయోవర్గాల్లో పోటీలు జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో అమెరికా, కెనడాలోని పలు కేంద్రాల్లో జరిగిన ప్రాథమిక పోటీల్లో విజేతలైన పిల్లలు తమ కుటుంబాలతో కలిసి చార్లెట్‌కు చేరుకుని మూడు రోజుల పాటు పండుగ వాతావరణంలో వేడుకల్లో పాల్గొన్నారు.
ముఖ్య అతిథి శ్రీ ప్రభల శ్రీనివాస్ విజేతలకు బహుమతులు అందజేస్తూ.. సిలికానాంధ్ర నాకు అత్యంత అభిమాన సంస్థ. మనబడి నిర్వహిస్తున్న తెలుగు మాట్లాట పోటీల స్థాయి, ఏర్పాట్లు, పిల్లల భాషా పటిమ నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. తెలుగు తెలిసిన యువతకు ఉద్యోగం, వ్యాపారం వంటి అనేక రంగాల్లో ప్రయోజనాలు ఉన్నాయి. తెలుగు తెలిసిన వారు సంగీతం, నాట్యం, నటన వంటి కళల్లో కూడా సులభంగా రాణించడాన్ని నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. తెలుగు మాట్లాట బృందం నిబద్ధత, సమర్థత అభినందనీయం అని అన్నారు.


