తెలివైన వాళ్లు ఇండియాను ఎందుకు వీడుతున్నారు?
డాలర్ డ్రీమ్స్...బీటెక్ చదవాలి.. అమెరికాకో..కెనడాకో.. జర్మనీకో ఎగిరిపోవాలి..ప్రతిష్టాత్మక యూనివర్శిటీలో చదువుకోవాలి. మంచి పేరు సంపాదించాలి. మంచి విజ్ఞనాన్ని ఆర్జించాలి. ఇలా ప్రతి సంవత్సరం లక్షలాది మంది తమ ఊరు, తమ నేల, తమ మనుషుల్ని వదిలి విదేశాలకు వెళ్తున్నారు. ఎవరో కలల కోసం, ఇంకెవరో అవకాశాల కోసం, మరెవరో గౌరవం కోసం..! కానీ ఆ ప్రయాణం ప్రతి ఒక్కరి గుండెల్లో ఒకే ప్రశ్నను లేపుతోంది. మన దేశం మన కలలను ఎందుకు ఆపలేకపోతోంది? భారతదేశం ఒక నేల మాత్రమే కాదు.. ఒక అనుభూతి..! జ్ఞానం, ధైర్యం, సంస్కారం కలిసిన ఒక శ్వాస..! అయినా కూడా ఈ పవిత్ర గడ్డపైనే పుట్టినవాళ్లు బయటకు ఎందుకు పరుగెడుతున్నారు? ఇది కేవలం వలస కథ కాదు.. ఇది మనసుల వేదన.. ఇది ఆశల కొత్త దిశలో పుట్టిన తపన..! ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది? భారతీయులు ఇండియాను ఎందుకు వదిలి వెళ్లిపోతున్నారు? నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడకుందాం.. కాసేపు దేశభక్తిని పక్కనపెడదాం.. దేశంపట్ల బాధ్యత కలిగిన వ్యక్తులగానే చర్చించుకుందాం.. అసలు ఈ సమస్యకు కారణమేంటి తెలుసుకుందాం.
నిజానికి భారత్ నుంచి బయలుదేరే ఈ ప్రయాణం కొత్తది కాదు.. బ్రిటీష్ కాలం నుంచే విదేశాలకు వెళ్లే మార్గం తెరుచుకుంది.. ఆ రోజుల్లో జీవనోపాధి కోసం సముద్రాలు దాటారు. తరువాతి కాలంలో బెంగళూర్, హైదరాబార్, గురుగ్రామ్ నగరాలనుంచి యువత విదేశాల తరలిపోయారు. చాలామంది అక్కడే స్థిరపడిపోయారు కూడా. మన దేశంలో చిన్న వయసు నుంచే పోటీ జీవితంలో ఒక భాగమవుతుంది.ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ సీటు కోసం పోటీ. ఇక చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం కొత్త పోరాటం. టాలెంట్ ఉన్నవాడికి తగిన గౌరవం దక్కడం అరుదుగా మారిపోయింది. ఇక్కడ పరిచయాలు చాలా సార్లు ప్రతిభ కంటే పెద్దవిగా మారుతాయి. అసలు కష్టపడి పనిచేసిన వాడే అవకాశాలు కోల్పోతున్నాడు. అదే మనసులో మిగిలిన నిరాశ ఆలోచనగా మారుతోంది. ఇక్కడ కష్టపడి పనిచేస్తే ఫలితం రాదని చాలా మంది ఫిక్స్ అయిపోతున్నారు.
జీవన ప్రమాణాలూ కారణమా?
అంతేకాదు.. ఇండియాలో జీవన ప్రమాణాలు కూడా చాలా నాసిరకంగా ఉంటాయి. నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. వాతావరణం, పరిశుభ్రత, నకిలీ మందులు. కచ్చిత పనిగంటల పనివిధానం. మరోవైపు విదేశాల్లో జీవన విధానం మనకు కొత్త ప్రపంచంలా అనిపిస్తుంది. నిబంధనలు స్పష్టంగా ఉంటాయి.. ప్రతి ఒక్కరి శ్రమకు గౌరవం ఉంటుంది. ఎవరైనా కష్టపడి పనిచేస్తే, ఆ కష్టం వృథా కాదనే నమ్మకం అక్కడ బలంగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలూ ఎక్కువే. టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఫైనాన్స్, పరిశోధన లాంటి రంగంలో ప్రపంచం తలుపులు తెరుస్తోంది. సమాన అవకాశాలు, సమాన గౌరవం అనే వాతావరణం విదేశాల్లో కనిపిస్తోంది.
మరోవైపు భారతీయులు విదేశాలకు వెళ్లడానికి ఆర్థిక భద్రత కూడా ఒక పెద్ద కారణం. నిజానికి ఇతర దేశాల్లో కూడా పన్నులు ఎక్కువే ఉంటాయి. అయితే అవి ఎక్కువగా ఉన్నా వాటి వినియోగాన్ని ప్రజలు చూస్తారు. ఇక్కడ పన్నులు చెల్లించినా అభివృద్ధి కనిపించదు. రోడ్లకు గుంతలే కనిపిస్తాయి. విద్యుత్ కోతలు కూడా వేధిస్తాయ్.. ఆస్పత్రుల సేవల్లో ఆలస్యం ఉంటుంది. చెప్పాలంటే ప్రభుత్వ రంగసంస్థల్లో పనిచేస్తున్న వాళ్లలో చాలామందికి బాధ్యత ఉండదన్న అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయింది. ఇటు కొంతమంది నిబద్ధతతో పనిచేయాలన్న ఆసక్తి ఉన్నా వ్యవస్థ దాన్ని అడ్డుకుంటుంది. ప్రతిభకు గౌరవం దక్కకపోవడం, అవినీతి పెరగడం, భవిష్యత్తుపై అనిశ్చితి లాంటివి భారతీయులను విదేశాలవైపు వెళ్లేలా చేస్తున్నాయి.
ఒక్కసారి మీరే ఆలోచించండి... మన దగ్గర మంచి చదువు చదివిన వాళ్లు, తెలివైన వాళ్లు బ్యాగ్ వేసుకుని విదేశాలకు ఎందుకు వెళ్లిపోతున్నారు? అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా.. ఇలా ఎక్కడైనా ఛాన్స్ దొరికితే వెళ్లిపోతున్నారు. వారి తెలివితేటలు, విజ్ఞానం మనకెందుకు దూరంగా పోతున్నాయి? ఇది చూసి చాలామందికి 'అబ్బే డబ్బుల కోసం వెళ్లిపోతున్నారు' అని అనిపించవచ్చు. కానీ అది నిజం కాదు. చదువుల్లో టాపర్స్, ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ లాంటి సంస్థల్లో సీట్లు సాధించిన వారు, చదువు పూర్తి చేసిన వెంటనే అమెరికా అనీ, యూరప్ అనీ, ఆస్ట్రేలియా అంటూ పక్క దేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్తున్నారంటే దీనికి కారణం కేవలం విలాసంగా బతకాలన్న కోరికా కాదండి. అలా వెళ్లేవాళ్లని అడిగితే 'ఇండియాలో నేను ఎంత పని చేసినా గుర్తింపు లేదు', 'రీసెర్చ్ చేయాలన్నా ఫ్రీడమ్ లేదు', 'నన్ను నమ్మే వాతావరణమూ లేదు' అని చెబుతున్నారు. వాస్తవానికి చాలామంది మేధావులు తమ టాలెంట్‌ను ఉపయోగించుకోవటానికి, అభివృద్ధి చేసుకోవటానికి సరైన ప్లాట్‌ఫామ్ కోసం వెతుకుతుంటారు. వారి పరిశోధనలకు అవసరమైన వనరులు, స్వేచ్ఛ, ప్రోత్సాహం లాంటివి ఇండియాలో లేవన్నది ఎక్కువగా వినిపిస్తున్న విమర్శ.
ఇదీ చదవండి: క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్‌ఆర్‌ఐ సక్సెస్ స్టోరీ
ఎంతమంది?
ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 2022లో 2,25,260 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదిలేశారు. 2023లో కూడా దాదాపు 2,16,219 మంది అదే పని చేశారు. 2014లో ఈ సంఖ్య 1,29,234 మాత్రమే ఉండగా, 2011 నుంచి 2023 మధ్య మొత్తం 19 లక్షల మంది భారతీయులు ఇండియా పాస్‌పోర్ట్‌ను వదిలేశారు. మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం 2014 నుంచి ఇప్పటి వరకు 23,000 మంది భారతీయ మిలియనీర్లు దేశం వదిలి వెళ్లిపోయారు. ఇదే సమయంలో, 2014 నుంచి 2022 మధ్యలో భారత బిలియనీర్ల ఆస్తులు 280శాతం పెరిగాయి, అంటే దేశ జాతీయ ఆదాయ వృద్ధి రేటుకంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. ఒకవైపు మధ్యతరగతి, ప్రతిభావంతులు అవకాశాల కోసం దేశం వదిలిపెడుతుంటే, మరోవైపు అత్యంత ధనవంతులు తమ భవిష్యత్ భద్రత కోసం విదేశాల్లో స్థిరపడుతున్నారు.
ఇక బ్రెయిన్ డ్రెయిన్ అంటే కేవలం ఒక గణాంకం కాదు.. ఇది దేశం కోల్పోతున్న మేధస్సు! ప్రతి ప్రతిభావంతుడు బయటకు వెళ్లినప్పుడల్లా మన భవిష్యత్తు కొంత వెనుక్కు వెళ్లిపోతుంది. ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే.. మన దేశం ఇలా మేధస్సును పోగొట్టుకోవడం ఆపాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా, ఇక్కడే ఉన్నత స్థాయి అవకాశాలు కల్పించాలి. పరిశోధనకు పెట్టుబడి పెట్టాలి. యువతను ప్రోత్సహించే విధానాన్ని అభివృద్ధి చేయాలి. టాలెంట్‌ను గుర్తించి, ప్రోత్సహించాలి. అవార్డులు, గ్రాంట్లు, రిస్క్ తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. సొంతదేశంలోనే అందరూ గర్వంగా ఎదిగేలా చేయాలి. ఎందుకంటే.. ఒకరు దేశాన్ని వదిలి వెళ్ళినప్పుడు, అది కేవలం వ్యక్తిగత నిర్ణయం కాదు. అది సమాజం, వ్యవస్థ ఇచ్చిన సిగ్నల్ కూడా. ఈ సిగ్నల్‌ను మార్చేది మనమే..కానీ అది ఎప్పటికి సాధ్యమవుతుందో కాలమే నిర్ణయించాలి.


