● యథేచ్ఛగా కృత్రిమ కల్లు విక్రయాలు
● పట్టించుకోని ఎకై ్సజ్ శాఖ
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో కృత్రిమ కల్లు విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. సాధారణంగా చెట్ల నుంచి సేకరించిన కల్లును మాత్రమే లైసెన్స్ పొందిన దుకాణాల్లో విక్రయించాల్సి ఉంటుంది. కానీ, నిబంధనలను పట్టించుకోకుండా నిర్వాహకులు కల్తీ కల్లు దందాకు పాల్పడుతున్నారు. రసాయనాల కల్లును సేవించి ప్రజల ప్రాణాలు కోల్పోపోతున్నా అధికారులు మాత్రం నామమాత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రోజుకు లక్ష లీటర్లు..
జిల్లా కేంద్రంలో మూడు కల్లు డిపోలు ఉండగా, రోజుకు లక్షకు పైబడి లీటర్ల కృత్రిమ కల్లు తయారవుతోంది. 280 మంది సభ్యులు కలిగి ఉన్న ఒకటి, రెండు డిపోల పరిధిలో 11 దుకాణాలు ఉన్నాయి. కేవలం 60 మంది సభ్యులు మాత్రమే కలిగి ఉన్న మూడో డిపో పరిధిలో అధికారికంగా 23 దుకాణాలు, అనధికారికంగా ఆరు దుకాణాలు కొనసాగుతున్నాయి. చుట్టుపక్కల ఈత వనాలు లేకపోయినా, ఆల్ఫ్రాజోలం, డైజోపామ్, శాక్రీన్, కుంకుడు రసం, పేస్ట్ తదితర తదితర రసాయనాలతో కల్లును తయారు చేస్తున్నారు.
పట్టని నిబంధనలు..
ఈత వనాలు ఉండే ప్రాంతాల్లోనే కల్లు డిపో ఏర్పాటు చేసి కల్లు తయారు చేయాల్సి ఉంటుంది. కానీ, ఈత వనం లేకుండా ఇతర ప్రాంతాల నుంచి కల్లు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. నందిపేట కేంద్రంగా 13 గ్రామాలకు కల్లు సరఫరా అవుతోంది. నవీపేటకు చెందిన ఓ వ్యక్తి చుట్టు పక్కల 16 గ్రామాలకు ఒకే ప్రాంతం నుంచి కల్లు సరఫరా చేస్తున్నారు. బోధన్ పట్టణం నుంచి తొమ్మిది గ్రామాలకు, మాక్లూర్ మండలంలో ఇద్దరు వ్యక్తులు 12 గ్రామాలకు కృత్రిమ కల్లు తయారు చేసి సరఫరా చేస్తున్నారు.
ప్రాణాలు పోతున్నా..
కృత్రిమ కల్లు సేవించిన వారిలో కొందరు ప్రాణాలు విడుస్తుండగా, మరికొందరు మతిస్థిమితం కోల్పోతున్నారు. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గతంలో కల్లు కాంపౌండ్‌లోనే మరణించాడు. గౌతంనగర్‌లోని కల్లు కాంపౌండ్ సమీపంలోనూ ఓ వ్యక్తి మరణించాడు. ఇలాంటి ఘటనలు అనేక చోట్ల చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు కృత్రిమ కల్లుకు బానిసలైన కొందరు గల్ఫ్ దేశాలకు వెళ్లిన సమయంలో అక్కడ కల్లు దొరకక మతిస్థిమితం కోల్పోయి తప్పిపోతున్నారు. ఇంతటి భయాందోళనకర పరిస్థితులు ఉన్నా ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన అధికారులు కొందరు మామూళ్లకు అలవాటుపడి కృత్రిమ కల్లు విక్రయాలకు ప్రోత్సహిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


