గోదావరి పుష్కర పనులకు అత్యంత ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

గోదావరి పుష్కర పనులకు అత్యంత ప్రాధాన్యత

Sep 27 2026 3:46 AM | Updated on Sep 27 2026 3:46 AM

నిజామాబాద్‌ అర్బన్‌: గోదావరి పుష్కర పనులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇప్పటికే కందకుర్తి, యంచ వద్ద భక్తుల సౌకర్యార్థం పనులను ప్రారంభించామని కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా అన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌, కమిషనర్‌ హనుమంత రావు శనివారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. వారు మాట్లాడుతూ.. పుష్కరాలకు గడువు సమీపిస్తున్నందున పనులను తక్షణమే చేపట్టి వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. నిజామాబాద్‌ కలెక్టరేట్‌ నుంచి వీసీలో కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా పాల్గొని, మాట్లాడారు. జిల్లాలోని కందకుర్తి పుష్కర క్షేత్రంతోపాటు బాసరకు చేరువలో ఉన్న యంచ వద్ద పనులు చేపట్టేందుకు శంకుస్థాపనలు పూర్తయ్యాయన్నారు. కందకుర్తి, యంచతోపాటు జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాలైన తుంగిని, పోచంపాడ్‌, తడ్‌పాకల్‌ తదితర పుష్కర ప్రదేశాల వద్ద అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. మార్చి నెలాఖరు నాటికి అన్ని పనులు పూర్తయ్యేలా స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తున్నామన్నారు. పుష్కర ఘాట్ల వరకు అప్రోచ్‌ రోడ్లు, ఘాట్ల మరమ్మతులు వంటి పనులను ప్రాధాన్యతాక్రమంలో చేపట్టేలా అధికారులకు దిశానిర్దేశం చేశామన్నారు. వీసీలో ఆర్మూర్‌ సబ్‌ కలెక్టర్‌ అభిగ్యాన్‌ మాల్వియ, డీఆర్వో గీత, నగర పాలకసంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌, జెడ్పీ సీఈవో సాయాగౌడ్‌, డీఆర్డీవో సాయన్న, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement