నిజామాబాద్ అర్బన్: భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని, జూలై 31వ తేదీలోగా అందిన అర్జీలలో ఒక్కటి కూడా పెండింగ్‌లో ఉండొద్దని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. భూభారతి పెండింగ్ దరఖాస్తులు, ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం తదితర రెవెన్యూ అంశాలపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తు లు, వాటి పరిష్కారంలో జాప్యానికి కారణాలను అ డిగి తెలుసుకున్నారు. పెండింగ్ దరఖాస్తులను స మగ్రంగా పరిశీలిస్తూ ఈ నెలాఖరులోగా అన్నింటిని పరిష్కరించాలని కలెక్టర్ గడువు విధించారు. అలసత్వం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చొరవ చూపాలని, సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న అర్జీలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం, తిరస్కరణలో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని, అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా చూడాలన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక అందుబాటులో ఉండేలా చొరవ చూపాలని, ఇసుక కేటాయింపులో అక్రమాలకు తావు లేకుండా, మధ్య దళారుల ప్రమేయం లేకుండా గట్టి నిఘా కొనసాగించాలని కలెక్టర్ ఆదేశించారు. గృహ నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో సంప్రదించి, వారికి నిర్ణీత ధరకే ఇసుక కేటాయింపులు జరుగుతున్నాయా లేదా అని ఆరా తీయాలన్నారు. ఎక్కడైనా అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తిస్తే.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపును వేగవంతం చేయాలని, అర్హులకు లాటరీ విధానం ద్వారా ఇళ్లను కేటాయించాలన్నారు. అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆర్మూ ర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, డీఆర్‌వో గీత, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, విజయకుమారి పాల్గొన్నారు.
ప్రణాళికాబద్ధంగా ధాన్యం సేకరణ
నిజామాబాద్ అర్బన్: ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యం సేకరణ, సేకరించిన ధాన్యాన్ని జాగ్రత్తగా నిల్వ చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం సంబంధిత శాఖల అధికారులు, తహసీల్దార్లతో ఖరీఫ్ ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. ఈసారి జిల్లాలో 4.35 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్నారని, 12లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. ఇందులో 6.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించామని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో రైతులకు అందుబాటులో ఉండేలా 736 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. గత రబీలో 660 కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈసారి అదనంగా 76 కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. అక్టోబర్ మొదటి వారం నుంచే కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ధాన్యం నిల్వ చేసేందుకు ఇబ్బందులు లేకుండా చూడాలని, అవసరమైతే మూతపడిన రైస్ మిల్లులు, పరిశ్రమలతోపాటు ఫంక్షన్ హాళ్లు, అనువైన ఖాళీ స్థలాలను గుర్తించాలని తహసీల్దార్లకు సూచించారు.
జూలై 31లోపు అందినవి పెండింగ్‌లో
ఉండొద్దు
అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు
తహసీల్దార్లతో సమావేశంలో
కలెక్టర్ భవేశ్ మిశ్రా


